రాష్ట్రంలోని ప్రతి పేదవాడి కష్టాన్ని తీర్చాలనేదే ముఖ్యమంత్రి తపన
- రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
నమస్తే భారత్ / మద్దూరు, నారాయణపేట జిల్లా (ఏప్రిల్ 17) : తెలంగాణ రాష్ట్రంలోని భూమి కలిగిన ప్రతి రైతుకు అందుబాటులో ఉండే విధంగా భూ భారతి చట్టం 2025 ను అందుబాటులోకి తీసుకొచ్చామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం పైలట్ మండలంగా ఎన్నుకోబడ్డ మద్దూరు మండలం ఖాజీపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో అన్నారు. భూ భారతి చట్టం 2025 ప్రకారం గతంలో ఉన్న సమస్యలను తొలగించి రైతులకు న్యాయం చేస్తామని, గత సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు భూ భారతి చట్టం 2025 అమలు చేయటంతో పాటు అనేక ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి చట్టం వల్ల భూమి కలిగిన ప్రతి వ్యక్తి ఇబ్బందులకు గురయ్యారని మంత్రి అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రతి రైతు, పేదవాడికి అందుబాటులో ఉండే విధంగా భూ భారతి చట్టం 2025 ను తీసుకొచ్చామని, ఇది యావద్భారత దేశానికే ఒక రోల్ మోడల్ కాబోతుందన్నారు. రైతులు గ్రామాలలో నిర్వహించే రెవెన్యూ సదస్సులలో పాల్గొని తమ భూసమస్యల పరిష్కారానికై దరఖాస్తు చేసుకోవాలని, అందుకోసం ఏ ఒక్క రైతు కూడా అణా పైస చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ధరణి చట్టం 2020 లో ఉన్న తప్పులను సరిచేసి కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన రైతులకు న్యాయం చేస్తుందన్నారు. గత ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దుచేసి రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించిందని ఇందిరమ్మ రాజ్యంలో రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారిని నియమించి రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు. భూ భారతి చట్టం 2025 ను రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేయడం కోసం మొదటి విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 6000 మంది లైసెన్స్ కలిగిన సర్వేయర్లను నియమిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. నేటి నుండి ఈ నెల చివరి నాటికి పైలట్ మండలాలలో భూ భారతి చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేసి, రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2, 2025 నాడు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని అన్నారు. ఇందుకుగాను వచ్చే నెల నుండి కలెక్టర్లు ప్రతి మండలంలో రెవెన్యూ సదస్సులను నిర్వహించి రైతులకు భూ భారతి చట్టం 2025 పై అవగాహన కల్పిస్తారని తెలిపారు. ప్రతిపక్షాలు రైతు సంక్షేమమే లక్ష్యంగా ఏర్పాటుచేసిన భూ భారతి చట్టాన్ని అభినందించక పోయిన పర్వాలేదు కానీ విమర్శించవద్దని సూచించారు. ఈ సమావేశంలో నారాయణపేట జిల్లా కలెక్టర్ శిక్తా పట్నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ బేన్ షాలోమ్, కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ తిరుపతి రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, పశ్చిమ వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ శ్రీమతి కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి, మద్దూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసింహ, మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి, రమేష్ రెడ్డి, విజయ్ కుమార్, వీరారెడ్డి, ఖాజాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
