సమస్యలకు శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా భూ భారతి అమలు
* జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: రాష్ట్రంలో ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపటమే లక్ష్యంగా ప్రభుత్వం భూభారతిని ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. భూభారతి పోర్టల్ అమలులో భాగంగా గుండాల మండలం ఆళ్లపల్లి గ్రామం రైతు వేదికలో భూభారతి చట్టం -2025 అవగాహన కార్యక్రమంలో గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూముల విషయంలో ఎలాంటి సమస్యలు ఏర్పడిన సంవత్సర కాలంలో పరిష్కరించుకోవడానికి భూభారతి ద్వారా అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. భూ సమస్యలపై గతంలో కోర్టులను ఆశ్రయించే వారు అని నేడు కోర్టులను ఆశ్రయించకుండానే షెడ్యూల్ (ఏ)ను ఏర్పాటు చేసి భూమి విలువ ఐదు లక్షలు లోపు ఉన్న పక్షంలో ఆర్డీవో స్థాయి ఐదు లక్షలపైగా ఉన్న పక్షంలో కలెక్టర్ స్థాయి అధికారులు సమస్యను పరిష్కరించడానికి అవకాశం కల్పించాలని తెలిపారు. భూమి విషయంలో దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఆ రోజు నుండి సంవత్సరకాలంలోపు సమస్యను పరిష్కరించడం జరుగుతుందన్నారు. కలెక్టర్ స్థాయిలో సమస్యను పరిష్కారం కానిపక్షంలో సి సి ఎల్ ఏ కు ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించారు. ప్రస్తుతం మండల తాసిల్దార్లు, సబ్ రిజిస్టర్ అధికారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారని ఇకనుండి చేసే రిజిస్ట్రేషన్ లను అన్ని పరిశీలించిన అనంతరమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు. గతంలో ధరణిలో కొన్ని లోపాలుండడం వల్ల భూ సమస్యలు పరిష్కారం కాలేదని ఇప్పుడు ప్రభుత్వం రూపొందించిన భూ భారతిలో వాటిని సరి చేసిందన్నారు. భూ భారతిలో రెవెన్యూ రికార్డులను సరిగ్గా మెయింటెన్ చేస్తారని ప్రతి సంవత్సరం భూముల రికార్డుల ను తీసి ఆ ఫైళ్లను తహసీల్దార్ కార్యాలయంలో భద్రపరు స్తామన్నారు. ఇప్పుడు అమలు చేస్తున్న భూభారతిలో సైతం ఎలాంటి లోపాలున్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. భూమికి సంబంధించి ఏదైనా తప్పు జరిగితే సంబంధిత తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లవచ్చని అక్కడ పరిష్కారం కాకపోతే ఆర్డీవోకు అప్పీలు చేసుకోవచ్చని అక్కడ కూడా న్యాయం జరక్కపోతే కలెక్టర్‌కు అప్పీలు చేసుకునే అవకాశం భూభారతిలో ఉందని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు భూభారతి పోర్టల్ లో ఉన్న వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ అవగాహన సదస్సులో కొత్తగూడెం ఆర్డీవో మధు, గుండాల తాసిల్దార్ ఇమాన్యుల్ , ఎంపీడీవో సత్యనారాయణ, రైతులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

