రైతులకు ఇబ్బంది లేకుండా యాసంగి పంట కొనుగోలు చేపట్టాలి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
నమస్తే భారత్ / నారాయణపేట్ జిల్లా : శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సన్న బియ్యం సరఫరా, ధాన్యం కొనుగోలు పై పౌరసరఫరాల శాఖ కమిషనర్ డి.ఎస్. చౌహాన్ తో కలిసి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బెన్ షాలం తో కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, అకాల వర్షాలు కారణంగా రైతులు నష్టపోకుండా నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు. దేశంలో అత్యధికంగా వరి పంట పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని అన్నారు.వానాకాలం పంట కొనుగోలు సజావుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించినందుకు కలెక్టర్లకు, అదనపు కలెక్టర్ లు, పౌర సరఫరాల అధికారులకు, ఇతర సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు. వాన కాలం కంటే అదనంగా యాసంగి సీజన్ లో 70 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు.ధాన్యం కొనుగోలు అంశంపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేకంగా మానిటర్ చేయాలని అన్నారు. రైస్ మిల్లర్లు తాళ్ళు, తరుగు పేరు మీద ఎటువంటి కోతలు లేకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేందుకు అధిక ప్రాధాన్యత అందించాలని, దీనికి అనుగుణంగా జిల్లాలలో ఐకెపి, ప్యాక్స్ కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలలో ఎక్కడైనా కొనుగోలు కేంద్రాలలో మౌలిక వస్తువుల కొరత ఉంటే కలెక్టర్లు వాటిని కొనుగోలు చేయవచ్చని మంత్రి తెలిపారు.భారత ఆహార సంస్థ మార్గదర్శకాలు ప్రకారం నూకల శాతం 25 దాటకుండా చూడాలని అన్నారు. ప్రభుత్వం అందించే ధర కంటే అధికంగా అందిస్తే మాత్రమే రైతులు ప్రైవేట్ గా బియ్యం అమ్ముకోవాలని, తక్కువ ధరకు ఎట్టి పరిస్థితుల్లో అమ్మడానికి వీలు లేదని అన్నారు. మన రాష్ట్రంలో అత్యధిక జనాభా దొడ్డు బియ్యం తినడం ఆపేసారని, దీనిని గమనించి రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం 84 శాతం జనాభాకు ఉచితంగా సరఫరా చేసే కార్యక్రమం చేపట్టామని అన్నారు. సన్న బియ్యం సరఫరా పంపిణీ విజయవంతం అవుతుందని, పేదలు, ప్రజలు సన్న బియ్యం సంతోషంతో స్వీకరిస్తున్నారని, 84 శాతం జనాభా ఆహార భద్రతకు సుస్థిరత ఏర్పడిందని అన్నారు.13 వేల కోట్లు ఖర్చు చేసి 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రేషన్ కార్డుదారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చూడాలని అన్నారు. సన్న బియ్యం నాణ్యత పై సామాజిక మాధ్యమాల్లో అక్కడక్కడ వస్తున్న వ్యతిరేక వార్తలను పరిశీలించి తప్పుడు వార్తలైతే వెంటనే ఖండించాలని మంత్రి అధికారులకు సూచించారు.నీటిపారుదల ప్రాజెక్టుల పరిధిలో ఎక్కడైనా త్రాగు నీటి సరఫరా ఇబ్బందులు, కొరత ఎక్కడైనా ఉంటే సమాచారం అందించాలని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

