వ్యాపార విస్తరణ దిశలో సింగరేణి తొలి అడుగు విజయవంతం

* ఇదే స్ఫూర్తితో ఇతర ఖనిజాల ఉత్పత్తికి ముందడుగు
* సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్
* అభినందనలు తెలిపిన సింగరేణి అధికారులు కార్మిక సంఘాల నేతలు
నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: సింగరేణి ఇతర రాష్ట్రాల విస్తరణలో తొలి అడుగుగా ఒడిశా రాష్ట్రంలో నైనీ బొగ్గు గనిని విజయవంతంగా ప్రారంభించడం జరిగిందని ఇదే స్ఫూర్తితో ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో మరిన్ని గనులు ఇతర ఖనిజ ఉత్పత్తులను కూడా చేపట్టేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. నైనీ బొగ్గు గని ప్రారంభంతో సింగరేణి ఎక్కడైనా విస్తరించగలదన్న భరోసా నమ్మకం అందరిలో కలిగిందన్నారు. నైనీ బొగ్గు బ్లాకును ప్రారంభించిన సందర్భంగా శనివారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో అధికారులు ఉద్యోగులు కార్మిక సంఘాల నాయకులు సీఎండీ ఎన్.బలరామ్ కు అభినందనలు తెలుపుతూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ నైనీ బొగ్గు బ్లాకు సాధన వెనుక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో పాటు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే వివిధ శాఖల అధికారుల సహకారం ఉందని తాను ఈ ప్రక్రియలో సమన్వయ బాధ్యతను స్వీకరించడం ఒక అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. తొమ్మిదేళ్ల సుదీర్ఘకాలంలో అనేక మంది మాజీ సింగరేణి అధికారులు కూడా తమ వంతుగా కృషి చేశారని వారికి అభినందనలు తెలిపారు. సింగరేణి సంస్థ ఇకపై కేవలం బొగ్గు ఉత్పత్తి సంస్థ గానే కాకుండా ఇతర ఖనిజాల ఉత్పత్తి సంస్థగా కూడా ఎదగనున్నదని థర్మల్ విద్యుత్తుతో పాటు పునరుత్పాదక విద్యుత్తు రంగంలో కూడా విస్తరించనున్నదని తెలిపారు. ప్రాతినిధ్య కార్మిక సంఘం సెక్రటరీ జనరల్ రాష్ట్ర కనీస వేతనాల కమిటీ ఛైర్మన్ జనక్ ప్రసాద్, గుర్తింపు కార్మిక సంఘం జనరల్ సెక్రెటరీ రాజకుమార్ మాట్లాడుతూ నైనీ సాధనలో రాష్ట్ర ప్రభుత్వం చొరవతో పాటు ఛైర్మన్ ఎన్.బలరామ్ ప్రత్యేక కృషి ప్రశంసనీయమని పేర్కొంటూ ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగానిర్వహించిన వీడియో సమావేశంలో అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు, అధికారుల సంఘం నాయకులు, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు, సీ.ఎం.ఓ.ఏ.ఐ ప్రతినిధులు కూడా నైనీ బొగ్గు గనిని సింగరేణి సాధించటం ఒక చారిత్రక ఘట్టమని దీనిలో ఛైర్మన్ కృషి ఎంతో ఉందని ప్రశంసలు కురిపించారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) ఎస్.డి.ఎం.సుభాని నైనీ బొగ్గు గని నుండి తీసిన తొలి బొగ్గు పెళ్ళతో ఛైర్మన్ ఉన్న చిత్రపటాన్ని జ్ఞాపికగా బహూకరించి శాలువతో సన్మానించారు. ఈ సమావేశంలో కొత్తగూడెం నుంచి సంస్థ డైరెక్టర్(ఈ అండ్ ఎం)సత్యనారాయణరావు, డెరెక్టర్(ఆపరేషన్స్)ఎల్.వి.సూర్యనారాయణ రావు, డెరెక్టర్ (పి.పి అండ్ పా) వెంకటేశ్వర్లు, జి.ఎం(సీపీపీ)మనోహర్, కార్పోరేట్ విభాగాల అధిపతులు, హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి జీఎం(మార్కెటింగ్)ఎన్.వి.రాజశేఖర్ రావు, ఆయా ఏరియాల జీఎంలు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")


Latest News
