భూభారతితో భూ సమస్యలకి శాశ్వత పరిష్కారం
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టం భూసమస్యలకు శాశ్వత పరిష్కారమని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు.
తేదీ, ఏప్రిల్ 21, 2025 –
నమస్తే భరత్ నిర్మల్ జిల్లా // ముధోల్ మండలంలోని కారేగాం గ్రామంలో సోమవారం నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతూ, గతంలో ధరణి వ్యవస్థతో రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని తెలిపారు. ఇప్పుడు భూభారతి చట్టం వాటికి సరైన పరిష్కారం అందించనుందని వివరించారు. ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా రైతులు తమ హక్కులను చట్టబద్ధంగా నమోదు చేసుకునే అవకాశం కలుగుతుందని వివరించారు. ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో రెవెన్యూ అధికారులు, న్యాయ నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసి భూభారతి చట్టాన్ని రూపొందించిందని తెలిపారు. గ్రామ పంచాయతీ స్థాయిలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆర్ఓఆర్ అప్డేషన్, సక్సెషన్, మ్యుటేషన్ వంటి సేవలు భూభారతిలో సులభంగా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. కొత్త చట్టంతో 90 శాతం భూసమస్యలు తహసీల్దార్ స్థాయిలోనే పరిష్కారం అయ్యే అవకాశం ఉందని, కేవలం 10 శాతం మాత్రమే ఆర్డీవో, కలెక్టర్ స్థాయికి వెళ్తాయని చెప్పారు. రైతులు భూభారతి చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం రైతులు తమ సమస్యలను కలెక్టర్‌కు వివరించారు. భూభారతి మార్గదర్శకాలను పవర్‌పాయింట్ ద్వారా రైతులకు వివరించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీవో కోమల్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి రాథోడ్ సుదర్శన్, తహసీల్దార్ శ్రీకాంత్, పలువురు రైతులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
