రాజీవ్ యువవికాసం దరఖాస్తుల పరిశీలన పకడ్బందీగా చేసి అర్హులను ఎంపిక చేయాలి. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
నమస్తే భారత్ / నారాయణపేట జిల్లా : రాజీవ్ యువవికాసం పథకానికి సంబంధించిన దరఖాస్తుల పరిశీలనను పకడ్బందీగా నిర్వహించి అర్హులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళ వారం కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ తో కలిసి ఆదేశించారు.ఎంపీడీవోలు, బ్యాంకర్లతో కలెక్టర్ రాజీవ్ యువ వికాసం పథకం అమలు, అర్హుల ఎంపికపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మండల స్థాయిలో దరఖాస్తులను ఎంపీడీవోలు, బ్యాంకు అధికారులు పరస్పర సమన్వయంతో పరిశీలించాలన్నారు. మొదటి ప్రాధాన్యతగా మహిళలు, వికలాంగులను, లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని సూచించారు. లబ్ధిదారులకు రుణం మంజూరు చేసే ముందు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరిపించాలన్నారు. ఒకే గ్రామంలో ఎక్కువమంది ఒకే రకమైన యూనిట్లు పెట్టే పరిస్థితి లేకుండా చూడాలన్నారు. దీనివల్ల వ్యాపారంలో పోటీ పెరిగి నష్టాలు వస్తాయన్నారు. సరైన లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలన్నారు. వయస్సు, కులం, ఆదాయం, ఇతర ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలని ఆమె సూచించారు. ఎంపికైన యూనిట్లకు సంబంధించిన గ్రౌండింగ్ పూర్తయిందో లేదో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, ఏవైనా సందేహాలుంటే వెంటనే పై అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ నెల 25 వరకు అర్హుల జాబితాను సిద్ధం చేసి ఉంచాలన్నారు.ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో భాగ్యలక్ష్మి, డీఆర్డీవో మొగులప్ప, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అబ్దుల్ ఖలీల్, మైనార్టీ సంక్షేమ అధికారి ఎం.ఏ. రషీద్, ఇండస్ట్రీస్ జీఎం భరత్ రెడ్డి, లీడ్ బ్యాంకు మేనేజర్ విజయ్ కుమార్, అన్ని మండలాల ఎంపీడీవోలు, బ్యాంకర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

