ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక పారదర్శకంగా జరగాలి.
భూ భారతి చట్టం ద్వారా ప్రజల భూ సమస్యల పరిష్కారానికి కృషి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
పేదల సొంతింటి కలను సాకారం చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇండ్ల పథకంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
తేదీ, ఏప్రిల్ 22, 2025-
నమస్తే భరత్ నిర్మల్:-పట్టణంలో కలెక్టర్ కార్యాలయ సమావేశంలో మంగళవారం ఆయన సచివాలయం నుంచి సీఎస్ శాంతి కుమారి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గౌతమ్‌తో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాట్లాడుతూ, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి తొలి విడతలో 3,500 ఇండ్లు మంజూరు చేశామని, ఏప్రిల్ 30 లోపు దరఖాస్తులపై ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తిచేయాలని పేర్కొన్నారు. ఇందిరమ్మ కమిటీ ఆమోదించిన జాబితాలో ఎవరైనా అనర్హులు ఉంటే, తక్షణమే తొలగించాలని తెలిపారు. బేస్మెంట్ దశ పూర్తిచేసిన లబ్ధిదారులకు మొదటి విడత కింద లక్ష రూపాయలు ఇప్పటికే విడుదల చేసినట్టు తెలిపారు. సామాగ్రి ధరలు కృత్రిమంగా పెరగకుండా చర్యలు తీసుకోవాలని, ఇసుక కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పట్టణాల్లో జీ+3 మోడల్ ఇండ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులను తాత్కాలికంగా నియమించి శిక్షణనందిస్తున్నట్టు వెల్లడించారు. భూ భారతి చట్టాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు జిల్లా స్థాయిలో వర్క్‌షాపులు నిర్వహించాలని మంత్రి సూచించారు. ఎల్.ఆర్.ఎస్ రాయితీ గడువు మరలా పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, జిల్లాలో భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహనా సదస్సుల వివరాలు, మండలాల వారీగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని మంత్రి, సీఎస్‌కు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీఓలు రత్నాకళ్యాణి, కోమల్ రెడ్డి, తహసీల్దార్ లు, ఎంపిడిఓ లు, తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
