సీతారామ ప్రాజెక్టు నిర్మాణంపై మంత్రి తుమ్మల వాస్తవాలు వెల్లడించాలి
* ప్రాజెక్టు నిర్మాణానికి తగిన నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేయాలి
* నీళ్ళ కేటాయింపులో జిల్లాకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోం
* గోదావరికి గండి ఎందుకు పెట్టారు..?
* సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు
నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: జిల్లా రైతాంగానికి సాగునీళ్ళు ఇవ్వకుండా తరలించే కుట్రలను సిపిఎం చూస్తూ ఊరుకోదనీ జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇచ్చిన తర్వాతనే ఇతర ప్రాంతాలకు తీసుకుని వెళ్ళాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.సాగునీటి కోసం జిల్లా వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టిన సిపిఎం సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లా రైతాంగానికి సాగునీళ్ళు ఇవ్వకుండా తరలించే కుట్రలను సిపిఎం చూస్తూ ఊరుకోదని ప్రాజెక్టు నిర్మాణంపై మంత్రి తుమ్మల వాస్తవాలు ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. సోమవారం మంచికంటి భవన్ లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి తుమ్మల గోదావరి జలాలు ఖమ్మం జిల్లాకు తీసుకువచ్చానని గొప్పలు చెప్పుకుంటున్నారని దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతాంగంలో తీవ్ర ఆందోళన నెలకొందని అన్నారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న వాస్తవాలు వెలికి తీయడం కోసం సిపిఎం జిల్లా నాయకత్వంతో కలిసి సీతారామ ప్రాజెక్టు నిర్మిస్తున్న కుమ్మరిగూడెం నుంచి జూలూరుపాడు వరకు ప్రాజెక్టు పంప్ హౌస్ లు కాల్వలు పరిశీలించామని తెలిపారు. ఈ సందర్భంగా వెల్లడైన వాస్తవాలు ఇలా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాలేదని మద్యలోనే అయిపోయిందని చెప్పారు. రిజర్వాయర్ లేదని అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గోదావరి నదికి గండికొట్టించి నీటిని సీతారామ కాలువకు మళ్లించారని తెలిపారు. ఈ నీళ్ళు దుమ్ముగూడెం ఆనకట్ట వల్ల హెవీ వాటర్ ప్లాంట్ మిషన్ భగీరథ సింగరేణి అవసరాల కోసం నిల్వ ఉన్నవి గండి కొట్టడం వల్ల ఇప్పుడు పూర్తిగా అడుగంటి పోయాయి తాగునీటికి కూడా కష్టాలు వస్తాయన్నారు. ముఖ్యమంత్రిని తీసుకువచ్చి హడావుడిగా ప్రారంభించింది పంప్ హౌస్ లు మాత్రమేననే తెలిపారు. గోదావరి జలాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతాంగానికి ఇవ్వడానికి ఎటువంటి పనులు చేపట్టలేదన్నారు. భద్రాచలం పినపాక కొత్తగూడెం ఇల్లందు నియోజకవర్గాలకు నీళ్ళు రాకుండా కుట్ర చేసి డిజైన్ మార్చారని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కాకుండా గోదావరి జలాలు ఆంద్ర ప్రాంతానికి తరలించే కుట్ర దాగి ఉందని అన్నారు. నిర్వాసితులకు నష్టపరిహారం పునరావాసం పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. జూలూరుపాడు వినోబా నగర్ నుంచి సాగర్ కాలువకు నీటిని అక్రమంగా మల్లించడం కోసం హడావుడిగా కాలువలు తవ్వారని ఈ విషయాలు తాము గుర్తించామని ఆయన తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు పెంచి ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న చెరువులకు పిల్ల కాల్వల ద్వారా అనుసంధానం చేస్తూ సాగు నీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. పాత డిజైన్ ప్రకారం రోళ్ళపాడు కునీళ్ళు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఏప్రిల్ 12న కొత్తగూడెంలో జిల్లా సదస్సు నిర్వహిస్తున్నామని జిల్లా రైతాంగం మొత్తం కదిలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్త ఉద్యమానికి సిపిఎం శ్రీకారం చుట్టిందని తెలిపారు. విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎజె రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లిక్కి బాలరాజు, అన్నవరపు సత్యనారాయణ, రేపాకుల శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్ తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

