హెచ్‌సీయూలో ఇప్పటికీ ఆగని పనులు.. కొనసాగుతున్న చెట్ల నరికివేత
హైదరాబాద్: కంచ గచ్చీబౌలిలోని వివాదాస్పద స్థలంలో పనులు కొనసాగుతూనే ఉన్నాయి. 400 ఎకరాల్లో చేపట్టిన పనులను ఒక రోజుపాటు నిలిపివేయాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వం చెట్ల నరికివేత, చదును చేసే కార్యక్రమాన్ని ఆపివేయలేదు. గురువారం ఉదయం 7 గంటల సమయంలో కూడా కూలీలతో చెట్లను నరికివేయించే పనులను కొనసాగింది. దీనికి సంబంధించిన వీడియోలను తమ మొబైల్ ఫోన్లలో బంధించిన హెచ్‌సీయూ విద్యార్థులు.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు.కాగా, కంచ గచ్చీబౌలిలోని 400 ఎకరాల్లో చేపట్టిన పనులను తక్షణమే నిలిపివేయాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకరోజు పాటు పనులను నిలిపివేయాలని పేర్కొంది. ఈ వివాదానికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై గురువారం మధ్యాహ్నం విచారణ చేపడతామని ప్రకటించింది. అయితే కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ బుధవారం సాయంత్రం వేళ కూడా పనులు కొనసాగిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అన్ని వర్గాల నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం చీకటి పడ్డాక పనులు నిలిపివేయాల్సి వచ్చింది. గచ్చీబౌలిలో 400 ఎకరాలను టీజీఐఐసీకి కేటాయిస్తూ ప్రభుత్వం గత ఏడాది జూన్ 26న జారీచేసిన జీవో 54ను సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కే బాబూరావు, వట ఫౌండేషన్ వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ యారా రేణుకతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఎస్ నిరంజన్‌రెడ్డి, ఎల్ రవిచందర్ వాదనలు వినిపిస్తూ, గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు, టీఎన్ గోదావర్మన్ తిరుమల్పాడ్, అశోక్‌కుమార్ శర్మ తీర్పులకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో ఇచ్చిందని తప్పుపట్టారు.సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉన్నదని చెప్పారు. ప్రభుత్వం మార్చి 15న కమిటీని ఏర్పాటు చేసినట్టు పత్రికల్లో వచ్చిందని తెలిపారు. యాభై ఎకరాలు దాటిన ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా, అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేయాలన్నా కేంద్రం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలనే నిబంధనకు వ్యతిరేకంగా జీవో ఇచ్చిందని చెప్పారు. పర్యావరణ అధ్యయనం చేయాలనే నిబంధనను సైతం ప్రభుత్వం తుంగలోకి తొకిందని తెలిపారు.వాల్టా చట్టం ప్రకారం మూడు అడుగులు పెరిగిన ఒక చెట్టును కొట్టాలన్న అధీకృత అధికారి అనుమతి తప్పనిసరిగా పొందాలని అన్నారు. కోర్టులో గత వారం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశామని, మధ్యంతర ఉత్తర్వులపై ప్రభుత్వ వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశిస్తూ విచారణను ఈనెల 7వ తేదీకి వాయిదా వేసిందని, ఈ లోగానే, పెద్ద ఎత్తున జేసీబీలు, పొక్లెయినర్లతో అకడి ప్రాంతాన్ని ధ్వంసం చేశారని చెప్పారు. తమ పిటిషన్లను కోర్టు అనుమతించేలోగా, ఆ భూములు ధ్వంసం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం అప్పుడు మరోచోట అటవీ ప్రాంతం అభివృద్ధి చేస్తామని చెప్పవచ్చునని, ఈ పరిస్థితులను అంచనా వేసి, ఆందోళనకర పరిస్థితులను గమనించి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇది హైదరాబాద్ మహానగరం మధ్యలో పర్యావరణ సమతుల్యతకు ఇది అవసరమని చెప్పారు. ఎన్టీఆర్‌ఎస్ ఫొటోలు సమర్పించాలని, అదేవిధంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారా? కమిటీ ఈ ప్రాంతాన్ని సందర్శించి నివేదిక ఇచ్చిందా? ఎన్ని చెట్లను కూల్చివేశారు? వాటికి అనుమతులు తీసుకున్నారా? తదితర వివరాలను ప్రభుత్వం నుంచి తెప్పించాలని కోరారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

