గ్రామాల్లో పార్టీని బలోపేతం చేస్తున్నాం -రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుంది - ప్రభుత్వం ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలి
- తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్రావు
నమస్తే భారత్: పినపాక : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన తెలంగాణ జన సమితిని బలోపేతం చేస్తున్నామని, పూర్తిస్థాయిలో మండల కమిటీతోపాటు గ్రామ కమిటీని నియమిస్తున్నట్లుగా తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి గోపగాని శంకర్రావు అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల కేంద్రంలో టీజేఎస్ మండల అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. డిసెంబర్ మూడో తేదీ నుండి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ రాక్షసి రాక్షస పాలన అంతమైందని, మిత్రపక్షాలతో కలుపుకుని కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రారంభమైందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షల రైతు రుణమాఫీ చేసి రికార్డు సృష్టించిదన్నారు. నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతుబంధు డబ్బులు కూడా జమ అయ్యాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి జిల్లాలో గల రైతు ప్రాజెక్టుల గురించి వివరించామని తెలిపారు. ముఖ్యంగా పినపాక నియోజకవర్గం కరకగూడెంలో గల పులుసువంత ప్రాజెక్టు ను పూర్తిచేసి రైతులకు సాగునీటి సమస్య తీర్చాలని కోరినట్లుగా తెలిపారు. పార్టీలకతీతంగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లులు కాంగ్రెస్ ప్రభుత్వం అందించాలని కోరారు. బలమైన మిత్రపక్షంగా ఉన్న తెలంగాణ జన సమితి మద్దతుతో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. ప్రొఫెసర్, ఎమ్మెల్సీ కోదండరాం నాయకత్వంలో రోజురోజుకు పార్టీ గ్రామాల్లో బలోపేతం అవుతుంది అని తెలిపారు. పార్టీ నిర్ణయానికి లోబడి పంచాయతీ ఎన్నికలకు సైతం సంసిద్ధమవుతున్నట్లుగా తెలిపారు. టీజేఎస్ జిల్లా నాయకులు కొమరం కాంతారావు సారధ్యంలో మండల కమిటీలు సైతం ఏజెన్సీ ప్రాంతంలో త్వరలో ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. రైతులకు పూర్తిస్థాయిలో తెలంగాణ జన సమితి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న మండల అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్ రెడ్డి కృషిని కొనియాడారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
