శ్రీశైల మల్లన్న క్షేత్రంలో ఈ నెల 27 నుంచి ఉగాది మహోత్సవాలు.. రోజు అలంకారంలో దర్శనమివ్వనున్న భ్రమరాంబాదేవి
శ్రీశైలం : శక్తిపీఠం, జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఈ నెల 27 నుంచి ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ నెల 31 వరకు ఐదురోజుల పాటు ఘనంగా జరుగనున్నాయి. ఉగాది వేడుకలకు కర్నాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఇప్పటికే పాదయాత్ర ద్వారా భక్తులు క్షేత్రానికి చేరుకున్నారు. వారి కోసం దేవస్థానం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది.
రోజుకో అలంకారంలో అమ్మవారు
ఈ నెల 27న భ్రమరాంబ అమ్మవారు మహాలక్ష్మీ అలంకారంలో, 28న మహాదుర్గగా భక్తులకు దర్శనమిస్తారు. 29న క్షేత్రంలో మహాసరస్వతి అలంకరణలో కటాక్షించనుండగా.. ప్రభోత్సవం, నందివాహనసేవ, వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం కార్యక్రమాలు జరుగనున్నాయి. 30న అమ్మవారి రమావాణిసేవిత రాజరాజేశ్వరిగా కటాక్షిస్తారు. ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం ఉంటుంది. అలాగే, రథోత్సవం నిర్వహిస్తారు. 31న అమ్మవారు నిజరూప దర్శనం అంటే.. భ్రమరాంబాదేవిగా దర్శనమిస్తారు. పూర్ణాహుతి, అశ్వవాహనసేవ జరుగుతుంది.
భక్తులకు చలువపందిళ్లు..
ఉగాది ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. టోల్‌గేట్ వద్ద బసవవనం, సిబ్బంది వసతి గృహాల వద్దనున్న బాలగణేశవనం, పాతాళగంగ మార్గంలో శివదీక్షా శిబిరాలు, ఆలయ పురష్కరిణి వద్ద పర్వతవనం, దక్షిణమాడవీధిలోని రుద్రాక్షవనం, శివాజీవనం, మల్లమ్మకన్నీరు మొదలైనచోట్ల భక్తుల కోసం చలువ పందిళ్లు వేయించింది. కాలిబాట మార్గంలో వెంకటాపురం, నాగలూటి, దామర్లగుంట, పెద్దచెరువు, కైలాసద్వారం వద్ద చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం కల్పించారు. ఉగాది మహోత్సవాల కోసం 1.36లక్షల నీటిని సరఫరా చేయనున్నది.
అన్న ప్రసాదాల వితరణ
భక్తులకు ఆలయం సమీపంలో అన్నపూర్ణాభవనంలో అన్న ప్రసాద వితరణ చేయనున్నది. నాగలూటి, కైలాసద్వారం, క్షేత్రపరిధిలోని పలుచోట్ల కన్నడ భక్తబృందాలు అన్నదానం చేస్తున్నాయి. ఆయా సంస్థలకు దేవస్థానం పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నది. ఉగాది ఉత్సవాల సందర్భంగా భక్తులకు వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అవసరమైన మెడిసిన్స్‌ను దేవస్థానం వైద్యశాలలో అందుబాటులో ఉంచింది. క్షేత్రానికి వచ్చే వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్‌ను ఏర్పాటు చేసింది. గణేశ్ సదన్ ఎదుట సెంట్రల్ పార్కింగ్ వద్ద బస్సులు నిలిపేందుకు ఏర్పాట్లు చేసింది. అలాగే, కార్లతో పాటు ఇతర వాహనాల కోసం క్షేత్ర పరిధిలోని జిల్లా పరిషత్ పాఠశాల సమీప ప్రాంతం (హెలిప్యాడ్ ఏరియా) దేవస్థానం ఆగమ పాఠశాల, ఆర్టీసీ బస్టాండ్ వెనుక విభూతిమఠం సమీప ప్రాంతం ఫిల్టర్ బెడ్ సమీప ప్రాంతం, మల్లమ్మ కన్నీరు, కొత్త వాసవీసత్రం దగ్గర భక్తులు వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల సందర్భంగా పారిశుధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆరు జోన్లు, 11 సెక్టార్లు, 67 ప్రదేశాలుగా విభజించింది.
సాంస్కృతిక కార్యక్రమాలు
ఉత్సవాల్లో భక్తులను అలరించేందుకు ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నది. దక్షిణమాడవీధిలోని ఉద్యానవనం, ఆలయ పుష్కరిణి వద్ద భ్రామరీ కళావేదిక వద్ద, శివదీక్షా శిబిరాలు, దేవస్థానం గోసంరక్షణశాల సమీపంలో యాంఫీథియేటర్ వద్ద పలు కన్నడ సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఏర్పాటు చేశారు. ప్రఖ్యాత నేపథ్య గాయనీ గాయకులతో కన్నడ భక్తి సంగీతవిభావరి, కన్నడ భక్తిరంజని, ప్రవచనాలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. స్వామిఅమ్మవార్ల కైంకర్యంలో భాగంగా గ్రామోత్సవంలో పలు జానపద కళారూపాల ప్రదర్శనలు నిర్వహించారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

