వ్యాపార రంగంలో మహిళలు ముందుకు సాగాలి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
నమస్తే భారత్ / నారాయణపేట్ జిల్లా : వ్యాపార రంగంలో మహిళలు వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. నారాయణ పేట జిల్లా కేంద్రంలో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రారంభించడం, దేశంలోనే మహిళా సమాఖ్య ద్వారా నడిపే పెట్రోల్ బంక్ ఇదే కావడంతో నారాయణ పేట జిల్లాకు ఎంతో పేరు, ప్రఖ్యాతలు వచ్చాయని, నిజంగా ఇది జిల్లా మహిళలు సాధించిన గొప్ప విజయమని కలెక్టర్ తెలిపారు. నారాయణ పేట జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం మలుపు దారి వద్ద గల వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రంలో మంగళవారం జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జిల్లా మహిళా సమాఖ్య సభ్యులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలు వ్యాపార రంగoలో రాణిస్తారని, పొదుపు అంటేనే మహిళలు.. మహిళలు అంటేనే పొదుపు అనే నానుడి ఉందన్నారు. అయితే మహిళలు వ్యాపార వేత్తలు గా ఎదగడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు. ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సులు,రైస్ మిల్లులు, సోలార్ పవర్ ప్లాంట్స్ ఇస్తోందని తెలిపారు. మహిళలు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నారు మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్ ఏర్పాటుతో నారాయణ పేట జిల్లాకు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందని, అదే విధంగా ఇంకా ఏదైనా వినూత్నంగా ఆలోచించి వ్యాపార పరంగా జిల్లా మహిళా సమాఖ్య మరో ముందడుగు వేయాలని ఆమె కోరారు. జిల్లా సమాఖ్య సభ్యులు అందరూ చర్చించి ఇంకా వేరే ఏదైనా వ్యాపారం చేయాలని అనుకుంటే డిఆర్ డీఏ కు తెలపాలన్నారు. మహిళా సమాఖ్యల సభ్యులకు తాము అండగా ఉంటామని, ప్రభుత్వ పరంగా అన్ని సహాయ సహకారాలు అందేలా చూస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ భరోసా ఇచ్చారు. మక్తల్ లోనూ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ను ఏర్పాటు చేయాలని ఉందని, మక్తల్ ఎంపీడీఓ కార్యాలయం పక్కన ప్రభుత్వ స్థలం ఉందని, ఆ స్థలం సమాఖ్య కు ఇప్పిస్తే అక్కడ తాము పెట్రోల్ బంక్ ను ఏర్పాటు చేసుకుంటామని మక్తల్ మండల మహిళా సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు కలెక్టర్ ను కోరారు. స్పందించిన కలెక్టర్ జిల్లాలో రెండో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తే మంచిదే అని, కానీ హైవే పక్కన స్థలంలో ఏర్పాటు చేస్తే బావుంటుందని చెప్పారు. మక్తల్ లో ఎంపీడీఓ కార్యాలయం పక్కన ఉన్న ప్రభుత్వ స్థలం విషయమై తాను మక్తల్ తహాసిల్దార్, ఎంపీడీఓ లతో మాట్లాడి వివరాలు తెప్పించు కుంటానని ఆమె తెలిపారు. మహిళలు సూపర్ మార్కెట్, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, ప్రైవేట్ స్కూల్ ఏర్పాటు, మహిళలు తయారు చేసే ఉత్పత్తులను ఆన్ లైన్ మార్కెటింగ్ చేయడం లాంటి వ్యాపారాలను ఎంచుకోవాలని కలెక్టర్ సూచించారు. గతంలో జిల్లాకు చెందిన మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు ఓ వెబ్ సైట్ ఉందని, ప్రస్తుతం ఆదే వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ విక్రయాలు చేయవచ్చని తెలిపారు. ఇప్పటికిప్పుడు ఏదో ఒకటి ఆలోచించ కుండా వారం రోజులు సమయం తీసుకుని ఏ వ్యాపరమైతే బావుంటుంది అని బాగా ఆలోచించిన తర్వాతే మరోసారి నిర్వహించే జిల్లా మహిళా సమాఖ్య సమావేశంలో అభిప్రాయం చెప్పాలని ఆమె సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గ్యాంగ్వర్ ను జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు చంద్ర కళ శాలువా, ఙ్ఞాపికతో సన్మానించారు. అలాగే జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులతో పాటు అన్ని మండలాల సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులను జిల్లా కలెక్టర్ జ్ఞాపిక, శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ మొగులప్ప, అడిషనల్ డి ఆర్ డి ఓ అంజయ్య, జిల్లా సమాఖ్య కార్యదర్శి, కోశాధికారి, అన్ని మండలాల సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నరు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
