వనమంతా జనం….. వన దుర్గమ్మకు నీరాజనం

* వన దుర్గమ్మను దర్శించి తరించిన రించిన భక్తజనం..
* తీరొక్క మొక్కులు చెల్లించుకున్న భక్తులు
* మంజీరాలోపుణ్యస్నానాలు ఆచరించి అమ్మ దర్శనానికి బారులు తీరిన భక్తులు
* వన దుర్గమ్మ నామస్మరణతో మార్మోగిన ఏడుపాయల క్షేత్రం
మెదక్ జిల్లా,పాపన్నపేట, సెప్టెంబర్ 6,(నమస్తే భారత్)
ఎటు చూసినా జనమే జనం.. అందరిలో భక్తి భావం.. ఆధ్యాత్మిక వాతావరణం ఆలయం చుట్టూ పచ్చని చెట్లు గల గల పారే గంగమ్మ పరవళ్ళు.. ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నామనిపించే వాతావరణం.. ఇది ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత క్షేత్రం ఆదివారం వారాంతపు సెలవు రోజు కావడంతో ఏడుపాయల భక్తులతో జనసంద్రమైంది.
ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసాయి. ఆలయ అర్చకులు వేకువ జామునే అమ్మవారికి అభిషేకం, అర్చనలు నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించి భక్తులకు వన దుర్గమ్మ దర్శనం కల్పించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు జిల్లాలు, జంట నగరాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో అమ్మ దర్శనానికి తరలివచ్చారు.
చెక్ డ్యాం, అమ్మవారి ప్రధాన ఆలయం ముందున్న మంజీరా నది పాయలో పుణ్యస్నానాలు ఆచరించి వన దుర్గాదేవి దర్శనానికి భక్తులు బారులు తీరారు. పలువురు భక్తులు అమ్మవారికి డప్పు చప్పుల మధ్య బోనాలు, ఓడిబియ్యం సమర్పించారు మరికొందరు భక్తులు తలానీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల జయ జయ ద్వానాల మధ్య ఏడుపాయల వనదుర్గాదేవి క్షేత్రం హోరెత్తింది. చల్లంగా చూడమ్మా.. వన దుర్గమ్మ తల్లి అంటూ భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. ఆలయ అర్చకులు పూజలు చేపట్టి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ సిబ్బంది భక్తులకు తగు ఏర్పాటు చేశారు.



