పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కోసం ఏర్పాటు చేసిన గద్దె కూల్చివేత
నర్సంపేట ఆగష్టు 10 (నమస్తే భారత్ ) :
నర్సంపేటలో దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కోసం ఏర్పాటు చేసిన గద్దెను కూల్చివేసిన ప్రదేశాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణను అడ్డుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విగ్రహ గద్దెను కూల్చివేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటన వెనుక కాంగ్రెస్ నాయకుల ప్రమేయం ఉందని మాకు అనుమానాలు ఉన్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎన్ని ఆటంకాలు, ఎన్ని కుట్రలు చేసినా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఖచ్చితంగా ఆవిష్కరించి తీరుతాం. నర్సంపేట పట్టణంలో ఇప్పటికే ఎన్నో విగ్రహాలు ఏర్పాటు చేయబడ్డాయి. వాటిలో ఎన్ని విగ్రహాలు అధికారిక అనుమతులతో ఏర్పాటు చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ ఘటనతో పాటు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణానికి ముందు ఆయన ఎదుర్కొన్న పరిస్థితులపై కూడా ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాలపై కూడా సమగ్రంగా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కార్యక్రమం ఉన్నందున తాత్కాలికంగా ధర్నాను విరమించుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి రెండు రోజుల సమయం ఇస్తున్నాం. ఈ రెండు రోజుల్లోగా విగ్రహ గద్దెను కూల్చిన బాధ్యులను గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే… ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ గ్రామాన పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి గౌరవం కోసం, న్యాయం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని మాజీ మంత్రి పేర్కొన్నారు



