రోడ్డు ప్రమాదంలో కారోబార్ కృష్ణ మృతి బాధాకరం
అంత్యక్రియలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
మెదక్ జిల్లా,పాపన్నపేట, మండలం ఆగస్టు 11 (నమస్తే భారత్)
పాపన్నపేట గ్రామపంచాయతీలో కారోబారుగా విధులు నిర్వహిస్తున్న ఆకుల కృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే ఎం. పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం నాడు ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో కృష్ణ మృతిచెందారు.ఈ విషయం తెలుసుకున్న పద్మాదేవేందర్‌రెడ్డి మంగళవారం పాపన్నపేట గ్రామానికి చేరుకుని కృష్ణ అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. అనంతరం కృష్ణ భార్యను ఓదార్చి,కుటుంబ సభ్యులకు మనో ధైర్యం చెప్పారు.
కృష్ణకు కేవలం తొమ్మిది నెలల పాప ఉండటాన్ని చూసి ఎత్తుకొని పద్మాదేవేందర్‌రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురై కంట కన్నీరుపెట్టారు. ఆయన సోదరులు మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, భాస్కర్ ల ను ఆమె ఓదార్చి ధైర్యం చెప్పారు. అంత్యక్రియలు పూర్తి అయ్యేంతవరకు పద్మా దేవేందర్ రెడ్డి. నాయకులతో కలిసి అక్కడే ఉన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో కృష్ణ మృతిచెందడం ఎంతో బాధాకరమన్నారు. తొమ్మిది నెలల చిన్నారిని చూసి తన మనసు కలచివేసిందని,కుటుంబ సభ్యుల బాధను తట్టుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.కృష్ణ భార్య, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని,శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు.వీరి వెంట పార్టీ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి,మాజీ ఏఎంసీ చైర్మన్ వెంకట్ రెడ్డి,జిల్లా నాయకులు సోములు,మాజీ సర్పంచ్ లు గురుమూర్తి గౌడ్, లింగారెడ్డి,నాయకులు కాశీనాథ్ రావు,ఉప్పరి వెంకటేశం,రంగంపేట శ్రీనివాస్ తో పాటు గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.



