డివైడర్లు తొలగించండి… ట్రాఫిక్‌కు విముక్తి కల్పించండి
-నెల క్రితం యూజీడీ పనుల కోసం ఏర్పాటు చేసిన డివైడర్లు ఇంకా యథాతథం
-పనులు పూర్తయినా తొలగించకపోవడంతో వాహనదారులకు నిత్యం అవస్థలు
-ఎమ్మెల్యే కేపీ వివేకానందకు స్థానికుల వినతిపత్రం
-ట్రాఫిక్ అధికారులతో వెంటనే మాట్లాడిన ఎమ్మెల్యే
-విలేజ్ వాహనాలకు ఎడమ మలుపు, నారాయణ ఆస్పత్రి వద్ద యూ-టర్న్‌కు ప్రతిపాదన
-త్వరలో సమస్యకు పరిష్కారం లభిస్తుందనే స్థానికుల ఆశాభావం
సూరారం, జూలై 8 ( నమస్తే భరత్ ): సూరారం ఎక్స్‌రోడ్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పైప్‌లైన్ పనుల కోసం నెల రోజుల క్రితం రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసిన డివైడర్లు ఇప్పటికీ తొలగించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చౌరస్తా వద్ద యూజీడీ పనులు ఇప్పటికే పూర్తయినప్పటికీ ట్రాఫిక్ ఆంక్షలను కొనసాగించడం వల్ల ప్రతిరోజూ వేలాది మంది వాహనదారులు అదనపు దూరం ప్రయాణించాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విలేజ్ వైపు నుంచి వచ్చే వాహనాలను నేరుగా అనుమతించకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, స్థానిక ప్రజలు అనవసరంగా చుట్టూ తిరిగి గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వస్తోందని తెలిపారు. దీనివల్ల సమయం, ఇంధనం వృథా కావడంతో పాటు ఎక్స్‌రోడ్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకూ పెరుగుతోందని పేర్కొన్నారు. ఈ సమస్యపై పర్యావరణ ప్రేమికుడు, సామాజికవేత్త కోల రవీందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, కోల శ్రీకాంత్, కె. శ్రీనివాస్ రెడ్డి, విక్రం రెడ్డి, కాలనీ అధ్యక్షుడు సురేష్, ప్రసాద్, కేశవ్, గోపాల్ రెడ్డి, అనీఫ్ తదితరులు ఎమ్మెల్యే కేపీ వివేకానందను కలిసి వినతిపత్రం సమర్పించారు. విలేజ్ నుంచి వచ్చే వాహనాలను ఎడమవైపుకు మళ్లించి, నారాయణ ఆస్పత్రి వద్ద యూ-టర్న్ సౌకర్యం కల్పించడం ద్వారా ట్రాఫిక్ సమస్యను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద సమస్యపై వెంటనే స్పందించి స్థానిక ట్రాఫిక్ పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. యూజీడీ పనులు పూర్తైనందున ఇక ఆలస్యం చేయకుండా డివైడర్లను తొలగించి, సిగ్నల్ వ్యవస్థను యథావిధిగా పునరుద్ధరించి ట్రాఫిక్‌ను సాధారణ స్థితికి తీసుకురావాలని అధికారులకు సూచించినట్లు తెలిసింది. ఎమ్మెల్యే సత్వర స్పందనపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. నెల రోజులుగా కొనసాగుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తే ప్రతిరోజూ ఈ మార్గంలో ప్రయాణించే వేలాది మంది వాహనదారులు, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులకు గణనీయమైన ఉపశమనం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.



