పర్యావరణాన్ని కాపాడడం మన అందరి బాధ్యత

ఖానాపురం ఆగష్టు25 (నమస్తే భారత్ ) :
పర్యావరణాన్ని కాపాడడం మన అందరి బాధ్యత అని
మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు , పీఏసీఎస్ చైర్మన్ వల్లే శ్రీనివాస్ లు అన్నారు.
ఖానాపురం మండలం అశోక్‌నగర్ గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ అచ్యుతం అద్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలో రైతువేదిక సమీపంలో, కేజీబీవీ పాఠశాల వద్ద, సైనిక్ స్కూల్ వద్ద ,విస్తృతంగా మొక్కలు నాటారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి సమతుల్యతను కాపాడడానికి మొక్కలు ఎంతో దోహదపడతారన్నారు. మొక్కలు నాటి వాటి సంక్షణ చేస్తే భూమిపై ఉన్న జీవరాశులకు ప్రాణవాయువును అందిస్తుందన్నారు. భవిష్యత్ తరాలకు మంచి ప్రకృతిని అందించడానికి ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలన్నారు. అనంతరం ఎంపీడీఓ వి. అద్వైత మాట్లాడుతూ ఖానాపురం మండలంలో పచ్చదనాన్ని పెంపొందించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడటం, ఎల్‌నినో వంటి సహజ వాతావరణ విపత్తుల ప్రభావాన్ని తగ్గించడంలో భాగంగా వనమహోత్సవాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను సంబంధిత విద్యార్థులకు అప్పగించి, మొక్కల పెరుగుదలపై నిరంతరం పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలకు వాచ్ అండ్ వార్డ్ ఏర్పాటు చేసి సంరక్షణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.ఖానాపురం మండలంలోని మొత్తం 21 గ్రామపంచాయతీలలోనూ వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, ఆయా గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు మరియు గ్రామస్తులను భాగస్వామ్యం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని ఎంపీడీఓ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు , పీఏసీఎస్ చైర్మన్ వల్లే శ్రీనివాస్ , ఏఎంసీ డైరెక్టర్ సారంగపాణి, ఉపసర్పంచ్ సారయ్య, మండల ప్రత్యేక అధికారి, డీటీడీఓ నారాయణ రెడ్డి , ఎంపీడీఓ వి. అద్వైత, డీఎల్‌పీఓ రాజీవ్, ఎంపీఓ ఎ. సునీల్ కుమార్, పంచాయతీ కార్యదర్శి జనార్దన్, వార్డు సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్ అరుణ, స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.



