రైల్వే ప్రమాదాలకు చెక్ పెట్టాలి
మల్కాజిగిరిలో మరిన్ని ఓవర్ బ్రిడ్జులు, అండర్ బ్రిడ్జులు నిర్మించాలి

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఈటల రాజేందర్ వినతి
➤ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో పెరుగుతున్న రవాణా అవసరాలకు అనుగుణంగా కొత్త రైల్వే వంతెనలు మంజూరు చేయాలి
➤ ఇప్పటికే ఆమోదం పొందిన రైల్వే ఓవర్ బ్రిడ్జులు, అండర్ బ్రిడ్జుల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలి
➤ రైల్వే పట్టాలు దాటుతూ జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు శాశ్వత భద్రతా చర్యలు చేపట్టాలి
➤ అవసరమైన ప్రతి చోట ఆటోలు, ద్విచక్ర వాహనాలు, పాదచారులకు అనువుగా చిన్న అండర్‌పాస్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జులు నిర్మించాలి
➤ వర్షాకాలంలో నీరు నిలిచి నిరుపయోగంగా మారుతున్న అండర్ బ్రిడ్జిల సమస్యకు దేశవ్యాప్త పరిష్కారం చూపాలి
➤ ప్రజల ప్రాణాల రక్షణే రైల్వే అభివృద్ధిలో అత్యున్నత ప్రాధాన్యంగా ఉండాలని కేంద్రానికి విజ్ఞప్తి
కుత్బుల్లాపూర్, జులై 31 ( నమస్తే భరత్ ) : తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల బృందం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి కోరింది. ఈ సందర్భంగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పలు కీలక అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో జనాభా, వాహనాల రాకపోకలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని రైల్వే ఓవర్ బ్రిడ్జులు, అండర్ బ్రిడ్జులు అత్యవసరమని ఆయన వివరించారు. ఇప్పటికే ఆమోదం పొందిన నిర్మాణాలను ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని, కొత్త ప్రతిపాదనలకు కూడా వెంటనే ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలో రైళ్ల వేగం, రైళ్ల రాకపోకల సంఖ్య గణనీయంగా పెరగడంతో ప్రజలు రైల్వే పట్టాలు దాటే సమయంలో ప్రమాదాలకు గురవుతున్నారని ఈటల రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది పెరుగుతున్న ఈ ప్రమాదాలను అరికట్టేందుకు శాశ్వత కార్యాచరణ రూపొందించాలని కేంద్ర మంత్రిని కోరారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన ప్రాంతాల్లో సుమారు 9 నుంచి 10 అడుగుల ఎత్తుతో, వీలైనంత వెడల్పుగా చిన్న అండర్‌పాస్‌లను నిర్మించాలని సూచించారు. అలాగే పట్టాలు తక్కువ ఎత్తులో ఉన్న చోట్ల పాదచారుల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జులు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశముందని తెలిపారు. ఇప్పటికే నిర్మించిన అనేక రైల్వే అండర్ బ్రిడ్జిల్లో వర్షాకాలంలో మూడు నుంచి నాలుగు అడుగుల మేర నీరు నిలిచిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కోట్ల రూపాయలు వెచ్చించిన నిర్మాణాలు నిరుపయోగంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్య తెలంగాణకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉందని, శాశ్వత సాంకేతిక పరిష్కారం తీసుకురావాలని కేంద్ర రైల్వే శాఖను కోరారు. రైల్వే ప్రమాదాలను పూర్తిగా నివారించడం, ప్రజలకు సురక్షిత ప్రయాణ వాతావరణం కల్పించడమే ప్రభుత్వాల ఉమ్మడి లక్ష్యంగా ఉండాలని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రజల భద్రతకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేయాలని కేంద్ర రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు.



