ePaper
Saturday, August 1, 2026
ePaper
Homeఎడిటోరియల్రెండు రోజుల్లోనే ఎస్ఐఆర్ లక్ష్యాలు పూర్తి చేయాలి

రెండు రోజుల్లోనే ఎస్ఐఆర్ లక్ష్యాలు పూర్తి చేయాలి

📰 Generate e-Paper Clip

రెండు రోజుల్లోనే ఎస్ఐఆర్ లక్ష్యాలు పూర్తి చేయాలి

మేడ్చల్ జిల్లాపై ఈసీఐ కార్యదర్శి నవీన్ కుమార్ సీరియస్ సమీక్ష

◉ పెండింగ్ ఫారాలు వెంటనే పరిష్కరించండి

◉ ప్రతి ఓటరికి నోటీసులు తప్పనిసరిగా అందాలి

◉ ప్రైవేట్ భవనాల నుంచి ప్రభుత్వ భవనాలకు పోలింగ్ కేంద్రాల మార్పు

◉ ఒక్కో పోలింగ్ కేంద్రానికి 1,200 మంది ఓటర్ల ప్రామాణికత పాటించాలి

◉ రాజకీయ పార్టీలకు సమాచారం ఇచ్చిన తర్వాతే మార్పులు

◉ తిమ్మాయిపల్లి, దూల్లపల్లిలో క్షేత్రస్థాయి తనిఖీలు

కుత్బుల్లాపూర్, జూలై 31 ( నమస్తే భరత్ ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్), ఫారమ్‌ల డిజిటైజేషన్, మ్యాపింగ్ ప్రక్రియలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) కార్యదర్శి నవీన్ కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఇంకా మిగిలి ఉన్న రెండు రోజుల గడువును సమర్థంగా వినియోగించుకుని లక్ష్యాలను గడువుకంటే ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి మను చౌదరి, ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలతో కలిసి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పురోగతిపై జిల్లాల వారీగా సమీక్ష చేపట్టిన ఈసీఐ కార్యదర్శి, మేడ్చల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పనులు ఇతర జిల్లాలతో పోలిస్తే వెనుకబడి ఉన్నాయని పేర్కొన్నారు. అందుకు గల కారణాలను అధికారులు వివరించారని తెలిపారు.

-పెండింగ్ ఫారాలపై ప్రత్యేక దృష్టి

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఫారాలు, ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యంతో పరిష్కరించాలని ఈఆర్‌వోలకు ఆదేశించారు. బీఎల్‌వోలు, బీఎల్‌వో సూపర్‌వైజర్లు నేరుగా ఓటర్లను సంప్రదించి వారి సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ అంశంపై ఎన్నికల సంఘం అత్యంత కచ్చితత్వంతో వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు.

-మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి

ఇంకా మ్యాపింగ్ పూర్తి కాని ఓటర్ల వివరాలను త్వరగా సేకరించాలని, ముఖ్యంగా నివాసం మారిన వారిని గుర్తించి తుది నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ల పనితీరుపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులు చేస్తున్న ఓటర్ల సమస్యలు సకాలంలో పరిష్కారమవుతున్నాయా అని అధికారులను ప్రశ్నించారు.

-ప్రతి నోటీసు ఓటరికి చేరాలి

జిల్లాలో భారీ సంఖ్యలో నోటీసులు జారీ చేయాల్సి ఉన్నందున ప్రతి నోటీసు సంబంధిత ఓటరికి తప్పనిసరిగా అందేలా చూడాలని ఆదేశించారు. వచ్చిన అభ్యంతరాలు, వివరణలను పట్టికలతో సహా ఈఆర్‌వోలు పరిశీలించి తుది నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

-పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ

పోలింగ్ కేంద్రాలు సాధ్యమైనంత వరకు ప్రభుత్వ భవనాల్లోనే ఉండాలని, ప్రస్తుతం ప్రైవేట్ భవనాల్లో ఉన్న కేంద్రాలను ప్రభుత్వ భవనాలు లేదా కమ్యూనిటీ హాళ్లకు మార్చాలని సూచించారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి 1,200 మంది ఓటర్లను ప్రామాణికంగా తీసుకుని హేతుబద్ధీకరణ చేపట్టాలని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల మార్పులు లేదా ఇతర సవరణలు చేపట్టే ముందు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.

-85 శాతం పని పూర్తయింది: కలెక్టర్

జిల్లా ఎన్నికల అధికారి మను చౌదరి మాట్లాడుతూ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడిన పూర్తిస్థాయి పట్టణ జిల్లా అని తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 24.60 లక్షల జనాభా ఉండగా, 2025 నాటికి అది సుమారు 48 లక్షలకు చేరుకుందని వివరించారు. ఎన్యుమరేషన్, డిజిటైజేషన్ ప్రక్రియలో ఇప్పటివరకు 85 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన 15-16 శాతం పనులను మరో రెండు రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎస్ఐఆర్, మ్యాపింగ్ ప్రక్రియ పురోగతిని ఈసీఐ కార్యదర్శికి వివరించారు.

-క్షేత్రస్థాయిలో తనిఖీలు

సమీక్ష అనంతరం ఈసీఐ కార్యదర్శి నవీన్ కుమార్ మేడ్చల్ నియోజకవర్గంలోని తిమ్మాయిపల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దూల్లపల్లి ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. అక్కడ కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి బూత్ లెవల్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, ఈఆర్‌వోలు వెంకట్ రెడ్డి, సంచిత్ గంగ్వార్, పింకెష్ కుమార్, రాధిక గుప్తా, మయాంక్ సింగ్, ఆర్‌డీవో మాలతి, ఏఈఆర్‌వోలు తదితర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!