ePaper
Tuesday, July 14, 2026
ePaper
Homeఎడిటోరియల్ఓటరు జాబితా సవరణలో జాప్యంపై ఈఆర్వో ఆగ్రహం

ఓటరు జాబితా సవరణలో జాప్యంపై ఈఆర్వో ఆగ్రహం

📰 Generate e-Paper Clip

ఓటరు జాబితా సవరణలో జాప్యంపై ఈఆర్వో ఆగ్రహం
క్షేత్రస్థాయిలో పురోగతి లేక అధికారులను నిలదీసిన పింకేష్ కుమార్
-17 రోజులు గడిచినా ఆశించిన స్థాయిలో పురోగతి లేదు
-బీఎల్వోలు, సూపర్వైజర్ల పనితీరుపై తీవ్ర అసంతృప్తి
-డేటా ఎంట్రీ ఆలస్యానికి అవగాహన లోపమే కారణమని వ్యాఖ్య
-పెండింగ్ దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశం
-ప్రతిరోజూ పురోగతిపై సమీక్ష నిర్వహిస్తామని స్పష్టం
-నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరిక

కుత్బుల్లాపూర్, జులై 12 ( నమస్తే భరత్ ): ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ప్రారంభమై 17 రోజులు గడిచినా క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించకపోవడంతో కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్, ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్వో) పింకేష్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఎల్వోలు, సూపర్వైజర్ల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, డేటా ఎంట్రీలో నెలకొన్న జాప్యంపై సంబంధిత అధికారులను నిలదీశారు. శనివారం పలు ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను స్వయంగా పరిశీలించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పరిశీలనలో భాగంగా ప్రసూన్ నగర్ సీనియర్ సిటిజన్స్ భవనాన్ని సందర్శించిన ఈఆర్వో, ప్రత్యేక సవరణ ప్రక్రియ ప్రారంభమై 17 రోజులు పూర్తవుతున్నప్పటికీ ఆశించిన ఫలితాలు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. బీఎల్వోలు, సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయకపోవడం, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు తగిన అవగాహన కల్పించకపోవడం వల్లే పనులు మందగిస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఫీల్డ్‌లో సేకరించిన వివరాల్లో లోపాలు, అసంపూర్ణ సమాచారం, అవకతవకల కారణంగా దరఖాస్తులను సకాలంలో పోర్టల్‌లో నమోదు చేయడం సాధ్యపడటం లేదని పేర్కొన్నారు. దీంతో డేటా ఎంట్రీ ప్రక్రియ తీవ్రంగా ప్రభావితమవుతోందని అన్నారు. ఆపరేటర్లకు అవసరమైన శిక్షణ, స్పష్టమైన మార్గదర్శకాలు అందించడంలో కూడా నిర్లక్ష్యం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులు, డేటా ఎంట్రీ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని బీఎల్వోలు, సూపర్వైజర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజూ పనుల పురోగతిని సమీక్షిస్తూ నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా చేరుకోవాలని సూచించారు. ఎస్ఐఆర్ వంటి కీలక ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికీ తావు ఉండదని, విధుల్లో అలసత్వం ప్రదర్శించే అధికారులు, సిబ్బందిపై ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని ఈఆర్వో పింకేష్ కుమార్ హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!