రోడ్ల ఆక్రమణలపై సీపీఐ గళo.

కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్‌కు సమగ్ర వినతిపత్రం
-చింతల్, మహాదేవపురం, గాజులరామారం సర్కిళ్లలో పెరుగుతున్న అక్రమ నిర్మాణాలు
-ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం.. వెంటనే తొలగించాలని డిమాండ్
-పైప్‌లైన్ రోడ్, బీరప్పనగర్‌లో మళ్లీ పెరుగుతున్న ఆక్రమణలపై ఆందోళన
-స్థానిక అధికారుల నిర్లక్ష్యంతో శాశ్వత ఆక్రమణలకు మార్గం సుగమం
-రాగి నారాయణరెడ్డి నగర్‌లో దెబ్బతిన్న రహదారిని వెంటనే పునరుద్ధరించాలని విజ్ఞప్తి
-ప్రజా ప్రయోజనాల పరిరక్షణకు పక్షపాతం లేకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు వినతి
కుత్బుల్లాపూర్, జులై 13 ( నమస్తే భరత్ ) : కుత్బుల్లాపూర్ జోనల్ పరిధిలోని చింతల్, మహాదేవపురం, గాజులరామారం సర్కిళ్లలో రహదారులను ఆక్రమిస్తూ అక్రమ నిర్మాణాలు విస్తరిస్తుండటంపై సీపీఐ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆక్రమణల కారణంగా ప్రజలు నిత్యం తీవ్ర రాకపోకల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం గతంలో సంబంధిత సర్కిల్ డిప్యూటీ కమిషనర్ల కార్యాలయాలకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోలేదని విమర్శించారు. దీంతో సీపీఐ ప్రతినిధి బృందం జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్‌ను కలిసి సమగ్ర వినతిపత్రం అందజేసింది. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న రహదారి ఆక్రమణలను తక్షణమే తొలగించడంతో పాటు, భవిష్యత్తులో కొత్తగా ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. జగద్గిరిగుట్ట పరిధిలోని పైప్‌లైన్ రోడ్, సీపీఐ కార్యాలయం సమీపం, బీరప్పనగర్ ప్రాంతాల్లో ఇటీవల అభివృద్ధి చేసిన రహదారులపై మళ్లీ ఆక్రమణలు జరుగుతున్నాయని నాయకులు వివరించారు. గతంలో మున్సిపల్ అధికారులు చేపట్టిన చర్యలు నామమాత్రంగానే ఉండటంతో ప్రస్తుతం తాత్కాలిక ఆక్రమణలు శాశ్వత నిర్మాణాలుగా మారే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాల విషయం స్థానిక అధికారులకు తెలిసినా సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని, దీంతో ప్రజల్లో అధికారుల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠ దెబ్బతినకుండా అధికారులు పక్షపాతం లేకుండా విధులు నిర్వహించి ప్రజా ప్రయోజనాలను కాపాడాలని జోనల్ కమిషనర్‌ను కోరారు. అదేవిధంగా రాగి నారాయణరెడ్డి నగర్‌లో బాక్స్ నాళా నిర్మాణ పనుల కోసం తవ్విన రహదారిని ఇప్పటికీ పునరుద్ధరించకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దెబ్బతిన్న రహదారికి వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు తొలగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్, ఏఐటీయూసీ కార్యదర్శి శ్రీనివాస్, ప్రజానాట్య మండలి అధ్యక్షుడు బాబు, సీపీఐ మండల కార్యవర్గ సభ్యులు సదానంద్, సహదేవరెడ్డి, వెంకటేష్, కొండయ్య, శ్రీనివాస్, జంబు, మహేష్, యాగంటి తదితరులు పాల్గొన్నారు.



