శంషాబాద్ బాలిక పాఠశాలలో అద్వాన్న పరిస్థితులు
గురుకులాలే కాదు ప్రభుత్వ పాఠశాలలు కూడా నిర్వీర్యం
రుచి పచి లేని మధ్యాహ్నం భోజనం
శుభ్రత లేని సౌచాలయాలు
పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి
ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల డిమాండ్
నమస్తే భరత్ , రాజేంద్రనగర్, జులై 17, గురుకులాలే కాదు ప్రభుత్వ పాఠశాలల్లో సైతం నిర్లక్ష్యం తాండవిస్తుందని మౌలిక సౌకర్యాల కల్పన విషయంలో పాఠశాల విద్యార్థుల అవస్థలు పడుతున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు కేవై ప్రణయ్ ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో శుక్రవారం ఎస్ఎఫ్ఐ మండల నాయకులు సందర్శించి విద్యార్థులతో మాట్లాడి పాఠశాల లో నెలకొన్న సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కేవై ప్రణయ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గురుకులాలే కాకుండా ప్రభుత్వ పాఠశాలలు కూడా కనీస వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.పాఠశాల ప్రారంభమై దాదాపు రెండు నెలలు కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు విద్యార్థినులకు యూనిఫామ్‌లు అందజేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.అలాగే పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత సరిగా లేదని, బియ్యం నాణ్యత లేకపోవడం వల్ల అన్నం మెత్తగా ఉండి విద్యార్థినులు తినలేకపోతున్నారని తెలిపారు. విద్యార్థులతో భోజనం చేస్తూ చర్చించగా సుమారు 30 శాతం మంది విద్యార్థినులు మధ్యాహ్న భోజనం చేయకుండా ఇంటి నుంచే టిఫిన్లు తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. పాఠశాలల్లో సౌచాలయాలు మరి దారుణంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ సమస్యలపై మండల విద్యాధికారి (ఎంఈఓ)కి ఫోన్ చేసి వారి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు , వెంటనే అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.అధికారులు నిర్లక్ష్యం కొనసాగిస్తే ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్‌తో మాట్లాడి పాఠశాలలోని మూత్రశాలలను వెంటనే శుభ్రపరచాలని సూచించారు. పరిశుభ్రత లేకపోతే విద్యార్థినులు అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సాయి వర్ధన్, రుద్రాక్ష, బిట్టు, హర్ష తదితరులు పాల్గొన్నారు.



