ePaper
Friday, June 26, 2026
ePaper
Homeఎడిటోరియల్సమగ్ర అభివృద్ధే లక్ష్యం.. అర్హులందరికీ సంక్షేమం

సమగ్ర అభివృద్ధే లక్ష్యం.. అర్హులందరికీ సంక్షేమం

📰 Generate e-Paper Clip

సమగ్ర అభివృద్ధే లక్ష్యం.. అర్హులందరికీ సంక్షేమం

-99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై జిల్లా స్థాయి సమీక్ష

-వార్డు సభలతో ప్రజా సమస్యల గుర్తింపు.. పరిష్కారానికి కార్యాచరణ

-విద్య, వైద్యం, వ్యవసాయం, గృహాలు, సంక్షేమంలో విశేష పురోగతి

-వర్షాకాల సన్నద్ధతపై ప్రత్యేక దృష్టి.. మున్సిపల్ యంత్రాంగానికి ఆదేశాలు

-ప్రతి శాఖ సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని అధికారులకు వికాస్ రాజ్ సూచన

కుత్బుల్లాపూర్, జూన్ 26 ( నమస్తే భరత్ ) ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా అధికారులు కృషి చేయాలని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేక అధికారి వికాస్ రాజ్ (ఐఏఎస్) సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక సమగ్ర అభివృద్ధికి దోహదపడిందని ఆయన పేర్కొన్నారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ మను చౌదరి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కోటిరెడ్డితో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, విజయేందర్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. వార్డు సభల నిర్వహణ ద్వారా గ్రామాలు, పట్టణాల స్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు అభివృద్ధి పనులను వేగవంతం చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం రూపొందించిన పది కీలక అంశాల ఆధారంగా చేపట్టిన కార్యక్రమాలు జిల్లాలో సమర్థవంతంగా అమలయ్యాయని వెల్లడించారు.

విద్యారంగంలో కీలక చర్యలు
జిల్లాలో 510 ప్రభుత్వ పాఠశాలల్లో 85 వేలకుపైగా విద్యార్థులకు విద్యా సదుపాయాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. కొత్త ప్రాథమిక పాఠశాలలు, ప్రీ-ప్రైమరీ విభాగాలు ప్రారంభించడంతో పాటు ఉచిత ఇంటర్నెట్, పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, చెప్పులు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, పాలు, రాగిజావ అందజేశారు. ‘బడిబాట’ కార్యక్రమంలో సుమారు రెండు వేల మంది పిల్లలను పాఠశాలల్లో చేర్పించినట్లు వెల్లడించారు.

వ్యవసాయానికి ఊతం
25,932 మంది రైతులకు రూ.15.58 కోట్ల రైతు భరోసా అందించగా, రైతు బీమా కింద 37 కుటుంబాలకు రూ.1.85 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. నానో యూరియా, సహజ వ్యవసాయం, డిజిటల్ పంట సర్వే, కిసాన్ డ్రోన్లు, సౌర పంపుసెట్లపై రైతులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు.

ఆరోగ్య సేవల్లో విస్తృత కార్యక్రమాలు
99 రోజుల కార్యాచరణలో భాగంగా విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు, రక్తపోటు, మధుమేహ పరీక్షలు, క్షయవ్యాధి నిర్ధారణ శిబిరాలు, దోమల నివారణ చర్యలు, గర్భిణీలకు ప్రత్యేక వైద్య సేవలు విస్తృతంగా నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వివరించారు. వడదెబ్బ నివారణపై వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణలు అందించినట్లు తెలిపారు.

సంక్షేమ పథకాల అమలు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల ద్వారా ప్రీ, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలతో పాటు విదేశీ విద్య కోసం 127 మంది విద్యార్థులకు రూ.25.41 కోట్ల ఆర్థిక సహాయం అందించారు. హాస్టళ్ల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, మౌలిక సదుపాయాల మెరుగుదలకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

ఇందిరమ్మ ఇళ్లలో పురోగతి
ఇందిరమ్మ గృహ పథకం కింద జిల్లాకు 2,249 ఇళ్లు మంజూరు కాగా, తొలి విడతలో 444 మంది లబ్ధిదారులు గృహప్రవేశాలు నిర్వహించారు. అలాగే నిర్మాణంలో ఉన్న 37,056 డబుల్ బెడ్‌రూం ఇళ్ల పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

మున్సిపల్ శాఖకు అప్రమత్తత ఆదేశాలు
వర్షాకాలంలో నీరు నిలిచే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రమాదాలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ అధికారులకు వికాస్ రాజ్ ఆదేశించారు. డ్రైన్ల శుభ్రత, ఫాగింగ్, వ్యర్థాల నిర్వహణ, తాగునీటి ట్యాంకుల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

మహిళా, శిశు సంక్షేమానికి ప్రాధాన్యం
23 అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునీకరించడంతో పాటు 11 మొబైల్ అంగన్‌వాడీలను ఏర్పాటు చేశారు. బాల్య వివాహాల నివారణ, మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన, పోషకాహార కార్యక్రమాలు, బాలభరోసా, దత్తత సహాయ కేంద్రం వంటి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

పర్యావరణ పరిరక్షణకు చర్యలు
అటవీ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కల నాటకం, ప్లాస్టిక్ నిర్మూలన, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణపై పాఠశాలలు, కళాశాలలు, పరిశ్రమల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలి
ప్రతి శాఖ తమ 99 రోజుల కార్యాచరణపై విజయగాథలు, ఉత్తమ విధానాలు, గణాంకాలు, ఛాయాచిత్రాలతో కూడిన సమగ్ర నివేదికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాలని జిల్లా ప్రత్యేక అధికారి వికాస్ రాజ్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికను విజయవంతంగా అమలు చేశామని తెలిపారు. మార్చి 6 నుంచి ప్రారంభమైన కార్యాచరణలో పాత ఫైళ్ల పరిష్కారం, కార్యాలయాల పరిశుభ్రత, ప్రజా సేవల మెరుగుదల వంటి అంశాల్లో విశేష ఫలితాలు సాధించినట్లు పేర్కొన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!