ePaper
Saturday, July 18, 2026
ePaper
Homeఎడిటోరియల్అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులు జిల్లా కలెక్టర్ మను చౌదరి హామీ

అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులు జిల్లా కలెక్టర్ మను చౌదరి హామీ

📰 Generate e-Paper Clip

అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులు
జిల్లా కలెక్టర్ మను చౌదరి హామీ

టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ప్రతినిధుల వినతికి సానుకూల స్పందన

నిబంధనల పేరుతో అర్హులను ఇబ్బంది పెట్టొద్దని విజ్ఞప్తి

అక్రిడిటేషన్ జారీలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్

సీనియర్ రిపోర్టర్లందరికీ కార్డులు అందేలా చర్యలు: కలెక్టర్

అక్రిడిటేషన్ కమిటీ పూర్తి సహకారం అందిస్తామని భరోసా

త్వరలోనే అర్హులైన జర్నలిస్టులకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావం

కుత్బుల్లాపూర్, జూలై 17 ( నమస్తే భరత్ ): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలో విధులు నిర్వహిస్తున్న అర్హులైన ప్రతి జర్నలిస్టుకు మీడియా అక్రిడిటేషన్ కార్డులు అందజేసేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ మను చౌదరి స్పష్టం చేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హత కలిగిన వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) రాష్ట్ర కోశాధికారి మోతే వెంకటరెడ్డి, జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాలరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతుల వెంకట్రాం రెడ్డితో పాటు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ప్రతినిధులు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్పందిస్తూ, జిల్లా వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న అర్హులైన సీనియర్ రిపోర్టర్లందరికీ నిబంధనల మేరకు అక్రిడిటేషన్ కార్డులు అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్రిడిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతుందని, అర్హులైన ఒక్క జర్నలిస్టు కూడా నష్టపోకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచిస్తామని పేర్కొన్నారు. అంతకుముందు టీయూడబ్ల్యూజే ప్రతినిధులు మాట్లాడుతూ, నిబంధనలను సాకుగా చూపుతూ అర్హులైన జర్నలిస్టులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేసి, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ ప్రక్రియలో జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. జర్నలిస్టుల వినతిపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించడం పట్ల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే పెండింగ్‌లో ఉన్న అక్రిడిటేషన్ దరఖాస్తుల పరిష్కారానికి వేగం పెరిగి, అర్హులైన జర్నలిస్టులందరికీ న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే స్టేట్ కౌన్సిల్ సభ్యుడు మల్కయ్య, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రవిచంద్ర, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు రామారావు, జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రవి కిరణ్ రెడ్డి, డబ్ల్యూడబ్ల్యూజే ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!