ప్రజావాణిలో వినతుల స్వీకరణ
దుండిగల్‌లో నాలుగు.. కొంపల్లి, గాజులరామారంలో ఒక్కో దరఖాస్తు.. త్వరిత పరిష్కారానికి ఆదేశాలు
కుత్బుల్లాపూర్, జూలై 6 ( నమస్తే భారత్): ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టే లక్ష్యంతో కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోని దుండిగల్ సర్కిల్–54, కొంపల్లి సర్కిల్–56, గాజులరామారం సర్కిల్–57 కార్యాలయాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖలకు పంపించి, నిర్ణీత గడువులో పరిష్కరించాలని డిప్యూటీ కమిషనర్లు అధికారులను ఆదేశించారు.
దుండిగల్ సర్కిల్–54లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ఎస్. వెంకట మణికరణ్ ప్రజల నుంచి మొత్తం నాలుగు ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో టౌన్ ప్లానింగ్ శాఖకు సంబంధించినది ఒకటి, ఇంజినీరింగ్ శాఖకు సంబంధించినవి మూడు ఉన్నాయి. కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్, డిప్యూటీ ఇంజినీర్లు పాపమ్మ, అన్వేష్ రెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్ సురేందర్ నాయక్ పాల్గొన్నారు.
కొంపల్లి సర్కిల్–56లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ డి. లావణ్య ప్రజల నుంచి ఒక వినతిపత్రాన్ని స్వీకరించారు. పెన్షన్ రద్దు చేయాలని కోరుతూ అందిన దరఖాస్తును సంబంధిత అధికారులకు పంపించి, త్వరితగతిన పరిష్కరించాలని ఆమె ఆదేశించారు.
గాజులరామారం సర్కిల్–57లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ శాఖకు సంబంధించిన ఒక దరఖాస్తు అందింది. దానిని నిబంధనల మేరకు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ప్రజావాణిలో అందిన ప్రతి వినతిని ప్రాధాన్యంగా పరిగణించి పారదర్శకంగా, నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావులేకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని డిప్యూటీ కమిషనర్లు అధికారులను ఆదేశించారు.



