ePaper
Tuesday, July 28, 2026
ePaper
Homeఎడిటోరియల్హమాలీల సంక్షేమానికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్

హమాలీల సంక్షేమానికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్

📰 Generate e-Paper Clip

హమాలీల సంక్షేమానికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్

-18వ హమాలీ ఆవిర్భావ దినోత్సవ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రసంగం

-రైతులు, హమాలీల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్

-కాలేశ్వరం నీటిని వినియోగించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శ

-హమాలీల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ కట్టుబడి ఉంటుందని హామీ

-సభలో పాల్గొన్న మల్కాజ్‌గిరి పార్లమెంట్ ఇన్‌చార్జి రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

-హమాలీల ఐక్యతతో పాటు కేసీఆర్ నాయకత్వానికి మద్దతు కొనసాగించాలని పిలుపు

 

కుత్బుల్లాపూర్, జులై 6 ( నమస్తే భరత్ ) : 18వ హమాలీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని హమాలీ కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ ఇన్‌చార్జి రాగిడి లక్ష్మారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులు, హమాలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా అందుబాటులో ఉన్న నీటిని వినియోగించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలో కలుస్తున్నప్పటికీ, రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడంతో పాటు సాగు విస్తీర్ణం పెరిగిందని, రైతులు అధికంగా వడ్లు పండించారని పేర్కొన్నారు. ఆ సమయంలో హమాలీలకు ఉపాధి అవకాశాలు పెరిగాయని, వారి కష్టానికి తగిన గుర్తింపు లభించిందన్నారు. హమాలీ కార్మికుల రేట్ల విషయాన్ని ప్రస్తావిస్తూ, గతంలో రూ.8గా ఉన్న రేటును కేసీఆర్ ప్రభుత్వం రూ.26కు పెంచిందని గుర్తుచేశారు. ఐదేళ్లకోసారి కాకుండా రెండేళ్లకోసారి రేట్ల సవరణ చేపట్టి కార్మికులకు మేలు చేశామని తెలిపారు. హమాలీల ఆరోగ్య భద్రతతో పాటు వారి సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించకుండా, పంటలను ఎండబెడుతోందని కేటీఆర్ ఆరోపించారు. నీళ్లు ఇస్తే యూరియా ఇవ్వాల్సి వస్తుంది, పంటలు పండితే మద్దతు ధర, బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం సాగునీటిని నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని, కానీ హమాలీ కార్మికులపై చర్యలు తీసుకుంటే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ అధికారంలో లేకపోయినా ప్రజల ఆదరణ ఏమాత్రం తగ్గలేదని, కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన ప్రతి కార్యకర్తను, ప్రతి హమాలీ కార్మికుడిని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. హమాలీ కార్మికులు చూపుతున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్, వారి ప్రతి సమస్య పరిష్కారానికి తాను బాధ్యత వహిస్తానని హామీ ఇచ్చారు. హమాలీలు ఐక్యంగా ఉండాలని, రానున్న కాలంలో కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి చిన్న సమస్యను పరిష్కరించేందుకు బీఆర్ఎస్ కట్టుబడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!