*మహనీయులకు మీరిచ్చే గౌరవం ఇదేనా? నిరహార దీక్షలో బీఎస్పీ నాయకులు*
*ఆగిరాల గ్రామంలో మహనీయుల విగ్రహాలకు అడ్డంగా గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణం*
*తక్షణమే నిర్మాణ పనులు నిలిపివేయాలి – బీఎస్పీ రంగారెడ్డి జిల్లా నాయకులు జి. బాలయ్య*
*కనీస నియమ నిబంధనలు లేకుండా ఎలా నిర్మిస్తారు? – బీఎస్పీ షాద్‌నగర్ అసెంబ్లీ ఇంచార్జి తుప్పరి కుమార్ ఎద్దేవా*
*గ్రామస్థులు వ్యతిరేకించినా అధికార మదంతో సర్పంచ్ ఏకపక్ష నిర్ణయం – బీఎస్పీ షాద్‌నగర్ అసెంబ్లీ ప్రెసిడెంట్ శివగళ్ల ఆంజనేయులు ఫైర్*
సమస్తే భారత్ షాద్ నగర్,నవంబర్07 కొందుర్గ్ న్యూస్: ఆగిరాల గ్రామంలో మహనీయుల విగ్రహాలకు గౌరవంగా, విగ్రహాల ప్రాధాన్యతకు ఆటంకం కలిగించే విధంగా గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణ పనులు చేపట్టడంపై బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు నిరహార దీక్షలో పాల్గొని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామస్థుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా, వారి వ్యతిరేకతను పట్టించుకోకుండా నిర్మాణ పనులు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బీఎస్పీ రంగారెడ్డి జిల్లా నాయకులు జి. బాలయ్య మాట్లాడుతూ, మహనీయుల విగ్రహాలు కేవలం విగ్రహాలు మాత్రమే కాదని, అవి సమాజానికి స్ఫూర్తినిచ్చే చరిత్రకు, ఆత్మగౌరవానికి, సామాజిక న్యాయ పోరాటాలకు ప్రతీకలని అన్నారు. అలాంటి మహనీయుల విగ్రహాల గౌరవానికి ఆటంకం కలిగించే విధంగా గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణం చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే నిర్మాణ పనులను నిలిపివేసి, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని డిమాండ్ చేశారు.బీఎస్పీ షాద్‌నగర్ అసెంబ్లీ ఇంచార్జి తుప్పరి కుమార్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణానికి స్థల ఎంపిక చేసేటప్పుడు కనీస నియమ నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాలు, ప్రజల అభిప్రాయాలు, భవిష్యత్తు అవసరాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కనీస నిబంధనలు పాటించకుండా, ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా నిర్మాణం ఎలా చేపడతారని ప్రశ్నించారు. గ్రామ అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, కానీ అభివృద్ధి పేరుతో మహనీయుల గౌరవానికి భంగం కలిగించడం, ప్రజల మనోభావాలను పట్టించుకోకపోవడం సరైన విధానం కాదని స్పష్టం చేశారు.
బీఎస్పీ షాద్‌నగర్ అసెంబ్లీ ప్రెసిడెంట్ శివగళ్ల ఆంజనేయులు మాట్లాడుతూ, గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ వారి అభిప్రాయాలను పట్టించుకోకుండా గ్రామ సర్పంచ్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని, కొంత మంది యువకులను పోలీసు వ్యవస్థతో బెదిరించి, వారి పై కుట్రలు చేస్తూ నిర్మాణ పనులు చేపట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. గ్రామ పంచాయతీ అనేది ప్రజలందరి భాగస్వామ్యంతో నడవాల్సిన వ్యవస్థ అని, ప్రజల అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అన్నారు. అధికార హోదాను అడ్డుపెట్టుకుని ప్రజల అభ్యంతరాలను పక్కనపెట్టడం తగదని, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పాలకులపై ఉందని పేర్కొన్నారు. తక్షణమే ఈ నిర్మాణంపై తగిన విచారణ జరిపి ఈ కార్యాలయం తగిన నియమ నిబంధనల పాటించి గ్రామ అభివృద్ధి కొరకు మరియు రాబోయే తరాల భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకొని గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో షాద్ నగర్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ నీరటి రాజు, ప్రధాన కార్యదర్శి కొండేటి మహేందర్, అసెంబ్లీ కార్యదర్శి తెలంగాణా రమేష్, బీఎస్పీ నాయకులు చింతగింజల రాజు, శరత్ చామర్ మరియు టీఆర్పీ పార్టీ నాయకులు రాధాకృష్ణ, ఎమ్మార్పీఎస్ నాయకులు గూడెం చెన్నయ్య, గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్ బిక్షపతి అగిరాల గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.



