ఎంటీఏఆర్ కార్మికుల పోరాటానికి యూఎస్ఎఫ్ఐ సంపూర్ణ సంఘీభావం
➤ 8వ రోజుకు చేరిన కార్మికుల ఆందోళనకు రాష్ట్ర కమిటీ మద్దతు
➤ ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులను వెంటనే శాశ్వత ఉద్యోగుల్లోకి తీసుకోవాలని డిమాండ్
➤యాజమాన్యం–కార్మిక సంఘాలతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని విజ్ఞప్తి
➤ శాంతియుత నిరసనలపై వేధింపులు, బెదిరింపులు తగవని హెచ్చరిక
➤ కార్మికుల హక్కుల పరిరక్షణకు చివరి వరకు అండగా ఉంటామని యూఎస్ఎఫ్ఐ హామీ
➤ సంఘీభావ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా నాయకులు, కార్యకర్తలు
కుత్బుల్లాపూర్, ఆగస్టు 6 ( నమస్తే భారత్ ): గాంధీనగర్ ఐడీపీఎల్లోని ఎంటీఏఆర్ (ఈఓయూ) బ్రాంచ్ వద్ద తమ న్యాయమైన హక్కుల సాధన కోసం సుమారు 400 మంది కార్మికులు ఎనిమిదో రోజుగా కొనసాగిస్తున్న శాంతియుత నిరసనకు యూఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సంపూర్ణ సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా యూఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ, సంస్థ అభివృద్ధికి ఎన్నో సంవత్సరాలుగా శ్రమిస్తున్న కార్మికులను వెంటనే శాశ్వత ఉద్యోగుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన హక్కుల సాధన కోసం సాగుతున్న ఈ ఉద్యమం ప్రతి శ్రమజీవి ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. కార్మికుల చెమటతో సంస్థలు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో వారికి ఉద్యోగ భద్రత, గౌరవప్రదమైన వేతనం, శాశ్వత ఉద్యోగం కల్పించడం యాజమాన్యం యొక్క సామాజిక, నైతిక బాధ్యత అని ఆయన అన్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని సంస్థ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చలు నిర్వహించి సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని కోరారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులపై ఎలాంటి వేధింపులు, బెదిరింపులు లేదా ఒత్తిళ్లు ఉండకూడదని స్పష్టం చేశారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం యూఎస్ఎఫ్ఐ చివరి వరకు వారి వెంట నిలుస్తుందని, వారి న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు సంఘీభావం కొనసాగిస్తామని వెంకటేష్ తెలిపారు. ఈ సంఘీభావ కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ధర్మాబాయి ఖుషితో పాటు ఇతర జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



