ePaper
Wednesday, October 28, 2026
ePaper
Homeఎడిటోరియల్నీటి సంరక్షణకు దోహదపడే పనులు, గ్రామీణ రహదారుల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి – ఎమ్మెల్యే...

నీటి సంరక్షణకు దోహదపడే పనులు, గ్రామీణ రహదారుల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి – ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

📰 Generate e-Paper Clip

నీటి సంరక్షణకు దోహదపడే పనులు, గ్రామీణ రహదారుల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి – ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ఉపాధి హామీ పనుల్లో రికార్డు స్థాయిలో పనిదినాలు కల్పించాలి

ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు, ఉపాధి హామీ ఏపీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించిన షాద్‌నగర్ ఎమ్మెల్యే

నమస్తే భారత్ షాద్ నగర్,అక్టోబర్27:ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు రికార్డు స్థాయిలో అత్యధిక పనిదినాలు కల్పించాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా నీటి సంరక్షణ పనులు, గ్రామీణ రహదారుల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నేడు ఫరూఖ్‌నగర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు, ఉపాధి హామీ ఏపీవోలతో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి పనుల పురోగతి, ఉపాధి హామీ పనుల అమలు, పెండింగ్ పనులపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వీబీ–జీ రామ్‌జీ పథకం ద్వారా గ్రామీణ ప్రజలకు అత్యధిక పనిదినాలు కల్పించడంతో పాటు, భవిష్యత్తులో గ్రామాలకు ఉపయోగపడే శాశ్వత ఆస్తుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ పథకం కింద అందుబాటులో ఉన్న వివిధ రకాల పనుల్లో నీటి సంరక్షణకు దోహదపడే పనులను గుర్తించి వేగంగా చేపట్టాలని కోరారు. ప్రస్తుతం నీటి వనరుల పరిరక్షణ ఎంతో కీలకమని, రాబోయే రోజుల్లో నీటి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టడం, భూగర్భ జలాలను పెంపొందించడం, అందుబాటులో ఉన్న నీటి వనరులను సంరక్షించడం వంటి పనులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాబోయే ఐదు నుంచి ఆరు నెలల పాటు గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అందుబాటులో ఉన్న నీటిని జాగ్రత్తగా వినియోగిస్తూ ప్రతి ఇంటికి తాగునీరు అందేలా గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవోలు, సర్పంచులు, ఎంపీడీవోలు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి రాకపోకలు సులభతరం చేసేలా మట్టి రహదారుల నిర్మాణానికి ఈ విడతలో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామాల్లో ఎక్కడా మట్టి రహదారుల పనులు పెండింగ్‌లో ఉండకుండా అవసరమైన పనులను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను కోరారు. ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడే పనులను ఎంపిక చేయాలని, చేపట్టే ప్రతి పనిలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న పనులను నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిప్యూటీ ఇంజనీర్లు శ్రీనివాస్, జీవన్ సింగ్, ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దయానంద్,అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఎంపీడీవోలు, ఉపాధి హామీ ఏపీవోలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!