ePaper
Tuesday, October 27, 2026
ePaper
Homeఎడిటోరియల్సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : సీఐ శ్రీనివాస్

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : సీఐ శ్రీనివాస్

📰 Generate e-Paper Clip

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : సీఐ శ్రీనివాస్

ఎస్‌ఆర్ ఒకేషనల్ కళాశాలలో సైబర్ క్రైమ్‌పై అవగాహన

నర్సంపేట, అక్టోబర్ 27 (మల్లేష్ నమస్తే భారత్) : విద్యార్థులు మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించి, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నర్సంపేట సీఐ ఎం. శ్రీనివాస్ సూచించారు. మంగళవారం నర్సంపేట పట్టణంలోని ఎస్‌ఆర్ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వాటిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్యార్థులు చదువుపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలను అవసరమైన మేరకే వినియోగించాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు పంపించే లింకులను తెరవకూడదని, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లు ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు. ఉద్యోగాల పేరుతో, బహుమతుల ఆశ చూపుతూ జరిగే ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
అనంతరం ఎస్‌ఐ నిహారిక మాట్లాడుతూ, సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారని, విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు, ఫొటోలు పంచుకోవద్దన్నారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 112 నంబర్‌కు కాల్ చేయాలని తెలిపారు. ఆన్‌లైన్‌లో డబ్బులు పోగొట్టుకున్న సందర్భాల్లో వెంటనే ఫిర్యాదు చేయడం ద్వారా నగదు బదిలీని అడ్డుకునే అవకాశం ఉంటుందని వివరించారు.
తెలియని వ్యక్తుల నుంచి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమైతే వాటిని స్వయంగా తిరిగి పంపకుండా బ్యాంకు అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. విద్యార్థులు సైబర్ భద్రతా నియమాలను పాటించడంతో పాటు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా అవగాహన కల్పించాలని పోలీసు అధికారులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌ఆర్ ఒకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కొయ్యడి సనత్ కుమార్, పారామెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ శిరీష, వైస్ ప్రిన్సిపాల్ సూరయ్య, సంతోష్, వెంకన్న, రమేష్ నాయక్, లయన్ ప్రవీణ్, హరి భూషణ్, సందీప్, శ్వేత, నజీమా, కుమార్‌తో పాటు కళాశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!