*విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తారా?*
*జీవో 97ను వెంటనే రద్దు చేయాలి*
*పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర*
*విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బతీసే నిర్ణయాలను ప్రభుత్వం విరమించుకోవాలి*
*మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్*
నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్20:పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యపై ఆధారపడుతున్న వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేలా ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా అన్ని వర్గాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యను అభ్యసిస్తున్నారని, డిప్లమా పూర్తి చేసిన వారికి సాంకేతిక రంగంలో మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. అలాంటి విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం, దానికి విరుద్ధంగా జీవో 97 తీసుకురావడం విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేయడమేనని అన్నారు. రాష్ట్ర సాంకేతిక విద్యా పరిధిలో కొనసాగుతున్న పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను యూనివర్సిటీల పరిధిలోకి మార్చే ప్రయత్నాలు చేయడం ద్వారా పాలిటెక్నిక్ కోర్సులను క్రమంగా నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలలో జాప్యం, విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కొరత వంటి సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించకుండా పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థనే దెబ్బతీసే నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. విద్యార్థుల భవిష్యత్తు, పేద మరియు మధ్యతరగతి కుటుంబాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పాలిటెక్నిక్ విద్యను యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని అంజయ్య యాదవ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన ఆలోచనా విధానాన్ని మార్చుకొని GO 97ను తక్షణమే రద్దు చేయాలని కోరారు. విద్యార్థుల ప్రయోజనాలకు భంగం కలిగించే నిర్ణయాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే, విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అవసరమైన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అంజయ్య యాదవ్ హెచ్చరించారు.



