ePaper
Sunday, June 28, 2026
ePaper
Homeఎడిటోరియల్పురుగులు పట్టిన చికెన్ కలకలం..! పేట్ బషీరాబాద్ కేఎఫ్సీపై వినియోగదారుల ఫిర్యాదు

పురుగులు పట్టిన చికెన్ కలకలం..! పేట్ బషీరాబాద్ కేఎఫ్సీపై వినియోగదారుల ఫిర్యాదు

📰 Generate e-Paper Clip

పురుగులు పట్టిన చికెన్ కలకలం..! పేట్ బషీరాబాద్ కేఎఫ్సీపై వినియోగదారుల ఫిర్యాదు

– -‘బై వన్–గెట్ వన్’ ఆఫర్‌లో కొనుగోలు చేసిన చికెన్‌లో పురుగులున్నాయని బాధితుల ఆరోపణ

— కుటుంబ సభ్యులు తిన్న తర్వాత విషయం గుర్తించామని నరేష్, సునీల్ వాదన

— పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా కేసు నమోదు కాలేదని ఆరోపణ

– -సీసీటీవీ ఫుటేజ్, ఆహార నమూనాలను స్వాధీనం చేసుకుని నిష్పక్షపాత విచారణ చేపట్టాలని విజ్ఞప్తి

– -ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి వాస్తవాలు నిర్ధారించాలని డిమాండ్
– –
— ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని బాధితుల విజ్ఞప్తి

పేట్ బషీరాబాద్, జూన్ 27 ( నమస్తే భరత్ ): పేట్ బషీరాబాద్‌లోని కేఎఫ్సీ అవుట్‌లెట్‌లో కొనుగోలు చేసిన చికెన్‌లో పురుగులు ఉన్నాయని ఆరోపిస్తూ ఇద్దరు వినియోగదారులు నరేష్, సునీల్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
బాధితులు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. శుక్రవారం కేఎఫ్సీలో నిర్వహించిన ‘బై వన్–గెట్ వన్’ ఆఫర్‌లో భాగంగా చెరో రూ.450 చొప్పున మొత్తం రూ.900 చెల్లించి చికెన్ కొనుగోలు చేశారు. ఇంటికి తీసుకెళ్లిన అనంతరం ప్యాకెట్ తెరిచి చూడగా చికెన్ నుంచి దుర్వాసన వస్తుండటంతో పాటు అందులో పురుగులు కనిపించాయని వారు ఆరోపించారు.
అప్పటికే కుటుంబ సభ్యులు, చిన్నారులు కొంతమేర ఆ చికెన్ తినడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యామని నరేష్ తెలిపారు. వెంటనే ఈ విషయాన్ని కేఎఫ్సీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా తమకు తగిన స్పందన రాలేదని ఆయన ఆరోపించారు.
అనంతరం అదే రాత్రి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు కేసు నమోదు కాలేదని బాధితులు ఆరోపించారు. ఫిర్యాదు స్వీకరించిన సమయంలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ “మేము ఫోన్ చేసినప్పుడు పురుగులు పట్టిన చికెన్ తీసుకురండి” అని చెప్పి పంపించేశారని నరేష్ పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే ఆహార నమూనాను స్వాధీనం చేసుకుని పరీక్షలకు పంపాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
అలాగే, తాము ఫిర్యాదు చేసిన అనంతరం కేఎఫ్సీ నిర్వాహకులు కూడా తమపై ఎదురుగా ఫిర్యాదు చేసినట్లు పోలీసుల ద్వారా తెలిసిందని బాధితులు తెలిపారు. ఆ ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధమని వారు పేర్కొన్నారు.
ఘటన జరిగిన సమయంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని, అందుబాటులో ఉన్న అన్ని ఆధారాలను పరిశీలిస్తూ నిష్పక్షపాత విచారణ చేపట్టాలని బాధితులు కోరారు. అలాగే సంబంధిత ఆహార నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించాలని, ఫుడ్ సేఫ్టీ అధికారులు అవుట్‌లెట్‌లో తనిఖీలు నిర్వహించి వాస్తవాలను నిర్ధారించాలని విజ్ఞప్తి చేశారు.
ఉన్నత పోలీసు అధికారులు తమ ఫిర్యాదుపై చట్టప్రకారం చర్యలు తీసుకుని, కేసు నమోదు అంశంపై స్పష్టత ఇవ్వడంతో పాటు నిష్పక్షపాత విచారణ నిర్వహించాలని బాధితులు కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!