పట్టుబడినా వదలని మట్టి దందా..!
కనిపించని అధికారుల చర్యలు
వరంగల్ ఆగష్టు6(నమస్తే భారత్ ) :
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని
ఖానాపురం మండలంలో గత కొన్ని నెలలుగా సాగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు, తరలింపు వ్యవహారం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. అసైన్డ్ భూములు, అటవీ భూములు, ఇతర ప్రభుత్వ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తవ్వి వ్యాపారం చేస్తున్న వారిపై గతంలో అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ అక్రమ దందా మాత్రం ఆగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గత ఏప్రిల్ 20న అక్రమ మట్టి తరలింపుకు పాల్పడిన పలువురిపై ఖానాపురం పోలీసులు కేసులు నమోదు చేసి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసిన విషయం తెలిసిందే. మరోసారి అదే నేరానికి పాల్పడితే భారీ మొత్తంలో జరిమానా విధించే అవకాశం ఉన్నప్పటికీ కొందరు అక్రమ వ్యాపారులు మాత్రం ఏమాత్రం వెనుకడుగు వేయకుండా యథావిధిగా మట్టి తరలింపును కొనసాగిస్తున్నట్లు సమాచారం. నిత్యం టీఎస్ 03 యుసీ 0211 నంబర్ గల టిప్పర్ ద్వారా అక్రమంగా మట్టి తరలింపు జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.మట్టి తరలింపు వ్యవహారం మండల కేంద్రంలో కనిపిస్తున్నప్పటికి ఉన్నాతాధికారులకు సమాచారం చేరగానే చర్యలు తీసుకోవాల్సిన క్షేత్రస్థాయిలో అవేమి కనిపించకపోవడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులు తనిఖీలు నిర్వహించే సమయంలో అప్పటి వరకు మట్టి త్రవ్వకాలు సాగిస్తూ సడన్ గా వాహనాలను అక్కడి నుంచి తరలిస్తూ పట్టుబడకుండా తమ
అక్రమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే బైండోవర్ అయిన వ్యక్తులే మళ్లీ అదే అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు రావడం అధికార యంత్రాంగంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అక్రమ మట్టి మాఫియాపై జిల్లా ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుని దందాకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఒకసారి పట్టుబడిన వారే మళ్లీ అదే నేరానికి పాల్పడుతున్న పరిస్థితి ఉంటే, బైండోవర్ చర్యల ప్రభావం ఎంతవరకు ఉందనే ప్రశ్న తలెత్తుతోంది. అక్రమ మట్టి తవ్వకాలపై నిరంతర నిఘా, బాధ్యులపై కఠిన చర్యలే శాశ్వత పరిష్కారమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.



