సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం
వరంగల్ సెప్టెంబర్ 5 (నమస్తే భారత్ ) :
అభివృద్ధి చెందిన భారత దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని వరంగల్ జాతీయ సాంకేతిక సంస్థ (ఎన్ టీ ) కెమికల్ ఇంజనీరింగ్ ఆచార్యులు కోల ఆనంద్ కిషోర్ అన్నారు . దేశాయిపేట లోని సికేఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి. పోశయ్య అధ్యక్షతన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి అధ్యాపకులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆచార్య ఆనంద కిషోర్ మాట్లాడుతూ సమాజంలో అన్ని రంగాలకు అవసరమైన నాణ్యమైన మానవ వనరులను తయారు చేసేది కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే అని తెలిపారు. అధ్యాపకులు కేవలం విద్యారంగానికి మాత్రమే కాదని సమాజాభివృద్ధిలో అత్యంత కీలకమని తెలిపారు. భారతదేశం స్వర్ణోత్సవ సంబరాలు చేసుకునే సమయం వరకు అభివృద్ధి చెందిన దేశంగా చూడడానికి అధ్యాపకులు వృత్తి పట్ల అంకితభావం కలిగి నిబద్ధతతో నిరంతరం కృషి చేయాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య జి.పోశ య్య మాట్లాడుతూ బోధనా రంగంలో సాంకేతికంగా ఎన్నో విప్లవాత్మక మార్పులు సంభవించాయని అయినప్పటికీ ఉపాధ్యాయుడు పాత్ర ఎప్పుడు ఎంతో ఉన్నతమైనదని పేర్కొన్నారు. అనంతరం ముఖ్య అతిథి ఆచార్య కె. ఆనంద కిషోర్, అధ్యాపకులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం లో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కే ఎల్ వి .వరప్రసాదరావు, అకాడమిక్ కోఆర్డినేటర్ కెప్టెన్ డాక్టర్ పి సతీష్ కుమార్, డాక్టర్ వసుధ, డాక్టర్ ఎస్ కే ఆయేషా, ఎస్ వెంకటేశ్వర్, ఎస్ అనిల్ కుమార్ , అతిధి అ ద్యాపకులు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.



