ePaper
Monday, August 24, 2026
ePaper
Homeఎడిటోరియల్ఆత్మగౌరవ పోరాటానికి తెలంగాణ బ్రాహ్మణ సమాజం సిద్ధం

ఆత్మగౌరవ పోరాటానికి తెలంగాణ బ్రాహ్మణ సమాజం సిద్ధం

📰 Generate e-Paper Clip

ఆత్మగౌరవ పోరాటానికి తెలంగాణ బ్రాహ్మణ సమాజం సిద్ధం

ఆగస్టు 25న ధర్నా చౌక్‌లో ‘మహా దీక్ష’

హైదరాబాద్ ఆగష్టు23(నమస్తే భారత్ ) :

తెలంగాణ బ్రాహ్మణ సమాజం తమ ఆత్మగౌరవ పరిరక్షణకు, హక్కుల సాధనకు సమరశంఖం పూరించింది. ‘తెలంగాణ బ్రాహ్మణ ఐక్యవేదిక’, ‘తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల వేదిక’ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 25 (మంగళవారం) నాడు హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వేదికగా ఉదయం 10:00 గంటల నుండి “తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ దీక్ష” పేరిట భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించాయి.
ఉద్యమకారులకు దక్కని తగిన గుర్తింపు
1,200 మందికి పైగా అమరుల త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ట్ర సాధనలో బ్రాహ్మణ ఉద్యమకారులు కీలక పాత్ర పోషించారని నేతలు గుర్తుచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ కేంద్రంగా, ప్రొఫెసర్ చుక్కా రామయ్య ఆశీస్సులతో సాగిన ఈ పోరాట స్వరం నేటికీ తగిన గుర్తింపు పొందలేకపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్వరాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం దాటినా తమ ఆకాంక్షలు నెరవేరకపోగా, వలసవాదుల పెత్తనం ఇంకా కొనసాగుతోందని ఆరోపించారు.
సంక్షేమ పరిషత్ నియామకాలపై ఆగ్రహం
‘తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్’ ప్రధాన బాధ్యతల్లో సీమాంధ్ర మూలాలున్న వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వడంపై ఐక్యవేదిక తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. తెలంగాణ మట్టి బిడ్డలైన ఉద్యమకారులను పక్కనబెట్టి బయటి వ్యక్తులకు పదవులు కట్టబెట్టడాన్ని తీవ్రంగా ఖండించింది.
అనుచిత వ్యాఖ్యలు – బెదిరింపులపై నిరసన
ఇటీవల జరిగిన ఓ అంతర్గత సమావేశంలో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఛైర్మన్ బసవరాజ్ శ్రీనివాస్ ఉద్యమకారులను ఉద్దేశించి అవమానకర రీతిలో మాట్లాడారని, “నేను పదవి వదిలేస్తే నెల రోజుల్లో ఉద్యమకారుల అంతు చూస్తాను” అని బహిరంగంగా బెదిరింపులకు దిగారని నేతలు మండిపడ్డారు.
సామాజిక సామరస్య పరిరక్షణే ధ్యేయం
సదరు నాయకుడు కుల దురహంకారంతో ప్రసంగిస్తూ దళిత, బహుజన వర్గాల మహిళలను తీవ్రంగా అవమానించారని ఆరోపించారు. బమ్మెర పోతన, కాళోజీ, వట్టికోట అల్వార్ స్వామి, దాశరథి, బుర్గుల రామకృష్ణారావు నుండి పి.వి. నరసింహారావు వరకు తెలంగాణ బ్రాహ్మణ సమాజం ఎప్పుడూ బహుజన వర్గాలతో ఐక్యంగా, సామరస్యంతో జీవించిందని గుర్తుచేశారు. ప్రాంతీయ అహంకారంతో కుల విద్వేషాలను రెచ్చగొట్టడాన్ని నిరసిస్తూ ఈ ఆత్మగౌరవ దీక్ష చేపడుతున్నట్లు ప్రతినిధులు స్పష్టం చేశారు.
సమాచార సేకరణ: డాక్టర్ జితేందర్ రావు తనుగుల (సీనియర్ జర్నలిస్ట్)

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!