పాఠశాలల్లో విద్యార్థుల ప్రవర్తన
ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు ఎలా వ్యవహరించాలి?
క్రమశిక్షణతో పాటు మానసిక అవగాహన అవసరం
**ప్రిన్సిపాల్ ఎలా వ్యవహరించాలి?
ప్రిన్సిపాల్ పాఠశాల పరిపాలనా అధికారి మాత్రమే కాదు; పాఠశాల సంస్కృతికి నాయకుడు.
• విద్యార్థుల ముందు అవమానించడం, తిట్టడం, బెదిరించడం వంటి పద్ధతులను నివారించాలి.
• తీవ్రమైన తప్పిదం జరిగినప్పుడు ముందుగా పరిస్థితిని నియంత్రించి, తర్వాత కారణాలను తెలుసుకోవాలి.
• విద్యార్థి ప్రవర్తనలో పదేపదే మార్పులు కనిపిస్తే కౌన్సిలర్/తల్లిదండ్రులతో సమన్వయం చేయాలి.
• హింసాత్మక బెదిరింపులు లేదా ఇతరులకు ప్రమాదం కలిగించే సంకేతాలను తేలికగా తీసుకోకూడదు.
• కౌన్సిలర్‌కు కౌన్సిలింగ్ కోసం తగిన సమయం, గోప్యత, స్వేచ్ఛ కల్పించాలి.
• ఉపాధ్యాయులకు సానుకూల దృక్పదం , అసభ్య పదజాలం , కోపాన్ని నియంత్రించడం , బాలల రక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించాలి.
ఉపాధ్యాయులు ఎలా వ్యవహరించాలి?
ఉపాధ్యాయుడు విద్యార్థి తప్పును ప్రశ్నించాలి — కానీ విద్యార్థి వ్యక్తిత్వాన్ని అవమానించకూడదు.
తప్పించుకోవాల్సిన మాటలు: “నువ్వు పనికిరాని వాడివి”, “నీ వల్ల ఎప్పుడూ సమస్యే”, “నువ్వు ఎప్పటికీ మారవు.”
దాని బదులు: “నువ్వు చేసిన పని తప్పు. ఎందుకు ఇలా చేశావో మాట్లాడుకుందాం.”
“నీకు కోపం ఎందుకు వచ్చింది?” మరియు “ఇలాంటి పరిస్థితి మళ్లీ వస్తే ఎలా ఎదుర్కోవచ్చు?” వంటి ప్రశ్నలు అడగాలి.
అంటే ప్రవర్తనను తప్పుబట్టాలి; వ్యక్తిని కాదు.
#అందరిలో అవమించడం కాదు — వ్యక్తిగతంగా మందలించాలి.
అందరి ముందు అవమానించడం వల్ల అవమానం → కోపం → ప్రతీకారం → దూరం → మరింత సమస్య వంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.
అందుకే సాధ్యమైనంత వరకు వ్యక్తిగతంగా మాట్లాడటం మంచిది. తప్పును స్పష్టంగా చెప్పాలి, కానీ విద్యార్థి గౌరవాన్ని కాపాడాలి.
#ప్రమాద సంకేతాలు కనిపిస్తే
ఉపాధ్యాయుడు సైకాలజీస్ట్ కావాల్సిన అవసరం లేదు. కానీ వార్నింగ్ సైన్స్ గుర్తించే వ్యక్తి కావాలి.
• తరచుగా హింసకు దిగడం
• తీవ్రమైన బెదిరింపులు చేయడం
• అకస్మాత్తుగా ప్రవర్తన మారడం
• ఇతర విద్యార్థులను భయపెట్టడం
• తీవ్రమైన అసభ్య పదజాలం వాడడం,
• ప్రతీకారం గురించి పదేపదే మాట్లాడడం,
• తనకు లేదా ఇతరులకు హాని చేస్తానని చెప్పడం,
ఇలాంటి సంకేతాలు కనిపిస్తే వెంటనే పాఠశాల కౌన్సిలింగ్ /సపోర్ట్ వ్యవస్థను ఉపయోగించాలి.
#కౌన్సిలర్ పాత్ర, కౌన్సిలింగ్ అనేది సమస్య వచ్చిన తర్వాత చేసే చివరి చర్య కాకూడదు.
టీచర్ అబ్సర్వేషన్ → రిఫర్రల్ → సైకాలజికల్ అసెస్మెంట్ → కౌన్సిలింగ్ → తల్లితండ్రుల ప్రమేయం →
ప్రతి కోపంగా ఉన్న పిల్లవాడిని “మానసిక సమస్య ఉన్న పిల్లవాడు”గా ముద్ర వేయకూడదు. అసెస్మెంట్ లేకుండా డైగ్నోసిస్ చేయకూడదు. కౌన్సిలర్స్ నియమించిన వారిని కౌన్సిలింగ్ తప్ప మిగిలిన ఏమైనా చేస్తున్నారు అది ఓ పెద్ద టాపిక్కు దాని గురించి నేను చెప్పలేను స్వామీ…..
#తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలి?
“మీ పిల్లవాడు చాలా చెడ్డవాడు” అని చెప్పడం కంటే, “మీ పిల్లవాడి ప్రవర్తనలో కొన్ని మార్పులు గమనించాం. కలిసి అర్థం చేసుకుని సహాయం చేద్దాం” అనే విధానం మంచిది.
పాఠశాల–తల్లిదండ్రులు ఒకరినొకరు నిందించుకోవడం కంటే, సమస్యను కలిసి పరిష్కరించుకోవాలి.
#క్రమశిక్షణ + మానవత్వం
పాఠశాలలో క్రమశిక్షణ తప్పనిసరి. కానీ క్రమశిక్షణ అంటే భయపెట్టడం కాదు; బాధ్యత నేర్పడం.
ప్రిన్సిపాల్ కఠినంగా ఉండవచ్చు. ఉపాధ్యాయుడు తప్పును ప్రశ్నించవచ్చు. కానీ అదే సమయంలో విద్యార్థి గౌరవాన్ని కాపాడాలి.
ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి….
“తప్పును వదిలేయనవసరం లేదు — కానీ పిల్లవాడిని కూడా కోల్పోవద్దు.”
ఒక మంచి పాఠశాల విద్యార్థి తప్పు చేసిన తర్వాత కేవలం “ఎలా శిక్షించాలి?” అని ఆలోచించదు.
మూడు ప్రశ్నలు అడగండి.
1. ఏం జరిగింది?
2. ఎందుకు జరిగింది?
3. మళ్లీ జరగకుండా ఏం చేయాలి?
ఇదే క్రమశిక్షణకు మానసిక శాస్త్రాన్ని జోడించే విధానం.
కొడితే మారతాడు” అనేది భయంపై ఆధారపడిన విధానం.
“అర్థం చేయిస్తే మారతాడు” అనేది బాధ్యత, అవగాహన, విలువలపై ఆధారపడిన విధానం.
శిక్షతో విద్యార్థి కొంతకాలం భయపడవచ్చు, కానీ అది తప్పును అర్థం చేసుకుని స్వయంగా మార్చుకోవడం కాదు. పైగా భయం, కోపం, అవమానం, ఉపాధ్యాయుడిపై ద్వేషం, అబద్ధాలు చెప్పడం వంటి సమస్యలు పెరగవచ్చు.
మధుబాబు చికిలే,స్కిలోక్రాట్,జాతీయ డైరెక్టర్,ప్రపంచ మానవ హక్కుల సమితి.



