ప్రజల మన్ననలే ప్రభుత్వ ఉద్యోగికి నిజమైన సంపద


-40 ఏళ్ల సేవలకు ఘన సత్కారం
-పదవీ విరమణ చేసిన ఉద్యోగులను సన్మానించిన కలెక్టర్ మను చౌదరి
-హౌజింగ్ శాఖ సేవలను ప్రత్యేకంగా ప్రశంసించిన కలెక్టర్
-ప్రజలకు మర్యాదతో సేవలందిస్తే చిరస్థాయిగా గుర్తుంటారని వ్యాఖ్య
-కుటుంబ సభ్యులతో ఆనందంగా పదవీ విరమణ జీవితం గడపాలని ఆకాంక్ష
కుత్బుల్లాపూర్, జూన్ 30 ( నమస్తే భరత్ ప్రభుత్వ ఉద్యోగంలో ప్రజలకు నిబద్ధతతో సేవలందించి, వారి మన్ననలు పొందడమే ఉద్యోగికి లభించే అత్యంత విలువైన సంపద అని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు. ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ, వారికి అవసరమైన సమాచారం, చేతనైన సహాయం అందిస్తే వారు జీవితాంతం గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం నిర్వహించిన పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హౌజింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ రమణమూర్తి, కలెక్టర్ కాన్ఫిడెన్షియల్ సెల్ (సీసీ) బాల భాస్కర్, హౌజింగ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) సుభాష్ రెడ్డి, కలెక్టరేట్ ఆఫీస్ సబార్డినేట్ జర్మియాజ్‌లను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ విధుల్లో ప్రజలతో సౌమ్యంగా వ్యవహరించడం, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడం ప్రతి ఉద్యోగి బాధ్యత అని అన్నారు. ప్రజల ప్రశంసలు, వారి ఆశీర్వాదాలే ప్రభుత్వ ఉద్యోగికి నిజమైన గుర్తింపని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ఇందిరమ్మ ఇళ్లు, 2 బీహెచ్‌కే గృహాల పథకాల కోసం జిల్లాలో 30 నుంచి 40 వేల వరకు దరఖాస్తులు అందాయని తెలిపారు. వాటి పరిశీలనలో హౌజింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ రమణమూర్తి ఎంతో ఓర్పుతో, పారదర్శకంగా వ్యవహరిస్తూ అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా కృషి చేశారని ప్రశంసించారు. ప్రజల సొంతింటి కలను సాకారం చేయడంలో హౌజింగ్ శాఖ కీలక భూమిక పోషిస్తోందన్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ప్రభుత్వ సేవలో విశిష్ట సేవలందించిన రమణమూర్తి పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతూ, తన అభిరుచులకు అనుగుణంగా జీవితాన్ని ఆస్వాదించాలని ఆకాంక్షించారు. కలెక్టర్ కాన్ఫిడెన్షియల్ సెల్‌లో పనిచేసిన బాల భాస్కర్ అధికారులకు, ప్రజలకు మధ్య సమన్వయ వారధిగా వ్యవహరించారని కొనియాడారు. కలెక్టరేట్‌కు వచ్చే ప్రతి ఒక్కరితో ఓర్పుగా, ఆప్యాయంగా మాట్లాడి సమస్యల పరిష్కారంలో విశేష సేవలందించారని పేర్కొన్నారు. తనతో పనిచేసిన కాన్ఫిడెన్షియల్ సెల్ సిబ్బందిలో బాల భాస్కర్ అత్యుత్తమంగా విధులు నిర్వహించారని ప్రత్యేకంగా అభినందించారు. అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు తమ సేవలతో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చారని అన్నారు. వారి భవిష్యత్ జీవితం ఆరోగ్యంగా, ప్రశాంతంగా, ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొని పదవీ విరమణ పొందిన ఉద్యోగులను ఘనంగా అభినందించారు.



