కుత్బుల్లాపూర్ కాంగ్రెస్‌కు కొత్త ఊపు.. 24 డివిజన్ అధ్యక్షులకు బాధ్యతలు
-టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు నియామకాలు
-డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ సహకారంతో ప్రక్రియ పూర్తి
-నూతన అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపిన ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి
-పార్టీ ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టాలని పిలుపు
-క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ సిద్ధాంతాలు, సేవా కార్యక్రమాల విస్తరణకు సూచన
-ప్రజలకు చేరువై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్ష
కుత్బుల్లాపూర్, జులై 2 ( నమస్తే భారత్ ) :టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు, డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ సహకారంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 24 డివిజన్లకు నూతన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమించారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి నూతనంగా బాధ్యతలు చేపట్టిన అధ్యక్షులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధ్యక్ష పదవి అనేది కేవలం ఒక హోదా మాత్రమే కాదని, పార్టీ నాయకత్వం మీపై ఉంచిన విశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ప్రతి డివిజన్ అధ్యక్షుడు ప్రజలకు మరింత చేరువ కావాలని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, సంక్షేమ విధానాలు, సేవా కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి డివిజన్‌లో పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం కావడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీని ముందుకు నడిపించాలని ఆకాంక్షించారు. నూతన నాయకత్వంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమై ప్రజల విశ్వాసాన్ని చూరగొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన డివిజన్ అధ్యక్షులందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తూ, పార్టీ అభివృద్ధి కోసం సమష్టిగా కృషి చేయాలని కొలన్ హన్మంత్ రెడ్డి పిలుపునిచ్చారు.



