ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

-దుందిగల్‌లోని కార్యాలయంలో ఎమ్మెల్సీని కలిసిన నాయకులు, ప్రజాప్రతినిధులు
-కాలనీల సమస్యలను వివరించి పరిష్కారానికి వినతి
-సానుకూలంగా స్పందించిన జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు
-శుభ కార్యక్రమాలకు ఎమ్మెల్సీకి ఆహ్వానం
దుందిగల్, జూలై 4 ( నమస్తే భరత్ ): ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ పరిధిలోని శంభీపూర్‌లో ఉన్న ఆయన కార్యాలయంలో శనివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన తాజా మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీల ప్రతినిధులు, మహిళలు తదితరులు మర్యాదపూర్వకంగా ఎమ్మెల్సీని కలిశారు. ఈ సందర్భంగా తమ ప్రాంతాల్లో నెలకొన్న తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, వీధి దీపాలు తదితర ప్రజా సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువచ్చి, వీటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
వారి వినతులను శ్రద్ధగా ఆలకించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సానుకూలంగా స్పందించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, స్థానిక సమస్యలను దశలవారీగా పరిష్కరించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించనున్న శుభ కార్యక్రమాలకు హాజరుకావాలని పలువురు నాయకులు, కాలనీ ప్రతినిధులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును ఆహ్వానించారు. అందుబాటులో ఉన్న మేరకు అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తానని ఆయన తెలిపారు.



