క్రైస్తవ స్మృతి వనాల అభివృద్ధికి రూ.1.26 కోట్ల నిధులు
-మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాకు రూ.126.75 లక్షల పరిపాలనా అనుమతులు
-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నిధుల మంజూరుపై హర్షం
-కాంగ్రెస్ ఇన్చార్జి కొలన్ హన్మంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన క్రైస్తవ సంఘాలు
-స్మృతి వనాల సుందరీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కొలన్ హన్మంత్ రెడ్డి
-అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం
-కార్యక్రమంలో పాల్గొన్న పాస్టర్లు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, డివిజన్ నాయకుల
కుత్బుల్లాపూర్, జూలై 24 ( నమస్తే భరత్ ): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని క్రైస్తవ స్మృతి వనాల (క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్స్) అభివృద్ధి, సుందరీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.1.26 కోట్ల (రూ.126.75 లక్షలు) పరిపాలనా అనుమతులు మంజూరు చేయడంతో క్రైస్తవ సంఘాల్లో హర్షాతిరేకం వ్యక్తమైంది. ఈ నిధుల మంజూరుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కొలన్ హన్మంత్ రెడ్డిని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, క్రైస్తవ సోదర సోదరీమణుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్మృతి వనాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఆధునిక మౌలిక వసతులతో స్మృతి వనాలను అభివృద్ధి చేసి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి వర్గం సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. క్రైస్తవ సంఘాల నాయకులు మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న స్మృతి వనాల అభివృద్ధి సమస్య పరిష్కార దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమన్నారు. మంజూరైన నిధులతో స్మృతి వనాల్లో రహదారులు, ప్రహరీ గోడలు, తాగునీటి సదుపాయం, విద్యుత్ వెలుగులు, పారిశుధ్య వసతులు తదితర మౌలిక సదుపాయాలతో పాటు సుందరీకరణ పనులు చేపట్టబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహాదేవపురం అధ్యక్షుడు సిద్ధునోళ్ళ సంజీవ్ రెడ్డి, రేవరెండ్ గోడి శేఖర్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ రివైవల్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ అధ్యక్షుడు కల్లోజి రవికుమార్, గాట్ కోఆర్డినేటర్, వివిధ డివిజన్ల అధ్యక్షులు, కార్యదర్శులు, పాస్టర్లు, క్రైస్తవ సంఘాల నాయకులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



