*ఇంజనీరింగ్ ‘బి కేటగిరీ’ సీట్లను కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ చేయాలి.*
*ఐ ఎస్ ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్ డిమాండ్.*

నమస్తే భారత్ షాద్ నగర్ జూన్29: ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని మరియు ఇంజనీరింగ్ ‘బి కేటగిరీ’ (మేనేజ్‌మెంట్ కోటా) సీట్లను పారదర్శకంగా కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో ఉన్నత విద్యా మండలి కార్యాలయం ముందు భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయం ముందు విద్యార్థి నాయకులు ప్లకార్డులు పట్టుకుని, నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఏ ఐ ఎస్ ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్ మాట్లాడుతూ, విద్యా హక్కు అనేది వ్యాపారం కాదని, విద్యార్థుల హక్కుల కోసం ఏ ఐ ఎస్ ఎఫ్ ఎల్లప్పుడూ పోరాడుతుందని స్పష్టం చేశారు. యాజమాన్య కోటా సీట్లను లక్షలాది రూపాయలకు అమ్ముకుంటూ, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ప్రైవేట్ కళాశాలలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ధర్నా ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థి నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి, పోలీస్ వాహనాల్లో ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసుల అరెస్టులను భయపడేది లేదని, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు.



