సఫిల్‌గూడ యూపీహెచ్‌సీపై డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీ

వైద్య సేవల నాణ్యత పెంపే లక్ష్యంగా సమగ్ర సమీక్ష
-ఓపీ, ల్యాబ్ రిజిస్టర్ల నిర్వహణపై డా. కె. ఆనంద్ ఆరా
-ఫార్మసీలో మందుల నిల్వలు, బఫర్ స్టాక్‌పై ప్రత్యేక తనిఖీ
-గడువు సమీపిస్తున్న మందుల వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని సూచన
-మాతా–శిశు ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయాలని ఆదేశం
-క్షయవ్యాధి కేసుల గుర్తింపు, డీబీటీ ప్రయోజనాలపై ప్రత్యేక దృష్టి
-క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన పర్యవేక్షణతో టీబీ నిర్మూలనకు కృషి చేయాలి
కుత్బుల్లాపూర్, జులై 17 ( నమస్తే భారత్ ) : మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌వో) డా. కె. ఆనంద్ శుక్రవారం సఫిల్‌గూడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్‌సీ)ను ఆకస్మికంగా సందర్శించి అక్కడ అందిస్తున్న వైద్య సేవలను క్షుణ్ణంగా సమీక్షించారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యానికి తావులేకుండా అన్ని విభాగాలు సమర్థవంతంగా పనిచేయాలని వైద్య సిబ్బందికి స్పష్టం చేశారు. తనిఖీలో భాగంగా ఓపీ, ప్రయోగశాల (ల్యాబ్) రిజిస్టర్లను పరిశీలించిన డా. ఆనంద్, నమోదులను ఎప్పటికప్పుడు పూర్తి వివరాలతో నిర్వహించాలని సూచించారు. అనంతరం ఫార్మసీని తనిఖీ చేసి మందుల నిల్వలు, బఫర్ స్టాక్ పరిస్థితిని పరిశీలించారు. గడువు సమీపిస్తున్న మందులను ముందుగానే గుర్తించి, వాటిని సకాలంలో వినియోగించేలా తగిన చర్యలు తీసుకోవాలని, మందుల నిర్వహణలో ఎలాంటి లోపాలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు పాటించాలని సిబ్బందికి ఆదేశించారు. మాతా–శిశు ఆరోగ్య సేవల అమలుపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించిన ఆయన, గర్భిణీల నమోదు, ప్రసవానంతర వైద్య సేవలు, చిన్నారులకు టీకాల కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ప్రతి గర్భిణి, ప్రతి శిశువుకు ప్రభుత్వ ఆరోగ్య సేవలు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమంపై కూడా ప్రత్యేక దృష్టి సారించిన డీఎంహెచ్‌వో, టీబీ కేసులను ప్రారంభ దశలోనే గుర్తించి, చికిత్స పొందుతున్న రోగులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. వారికి అందించాల్సిన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతమైన పర్యవేక్షణతో ప్రభుత్వం నిర్దేశించిన టీబీ నిర్మూలన లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. ఈ ఆకస్మిక తనిఖీలో ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొని, డీఎంహెచ్‌వో సూచనలను అమలు చేస్తామని తెలిపారు. జిల్లా ప్రజలకు మరింత మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.



