ePaper
Thursday, June 18, 2026
ePaper
Homeఎడిటోరియల్యూరియా బుకింగ్ యాప్‌ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అంకిత్

యూరియా బుకింగ్ యాప్‌ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అంకిత్

District Collector Ankit launches urea booking app.

📰 Generate e-Paper Clip

యూరియా బుకింగ్ యాప్‌ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అంకిత్

ప్రతి రైతుకు తగినంత ఎరువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే కోరం కనకయ్య

రైతులు ఇంటి వద్ద నుంచే యూరియాను సులభంగా బుక్ చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం టేకులపల్లి మండలంలోని బేతంపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య పాల్గొన్నారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ అవసరాల కోసం సుమారు 40 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని, ప్రస్తుతం 15 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. రైతులకు అవసరమైన మేరకు యూరియా సరఫరా చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందన్నారు. యూరియాను అవసరానికి మించి వినియోగించడం వల్ల భూసార సాంద్రత తగ్గిపోవడంతో పాటు భవిష్యత్తులో అధిక మొత్తంలో ఎరువులు వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారులు సూచించే శాస్త్రీయ పద్ధతులను పాటిస్తూ సమతుల్య ఎరువుల వినియోగంపై దృష్టి సారించాలని సూచించారు.

జిల్లాలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో మొక్కజొన్న సాగు జరిగిందని, ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నందున రైతులు పంటల వైవిధ్యీకరణ, పంట మార్పిడి పద్ధతులను అవలంబించాలని కలెక్టర్ సూచించారు. రైతులకు ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌పై విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. టేకులపల్లి మండలంలో ఐదు రైతు వేదికల ద్వారా యూరియా అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 18001237157 సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య మాట్లాడుతూ ప్రతి రైతుకు తగినంత ఎరువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రైతులకు ఎరువుల కొరత తలెత్తకుండా ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.గత సీజన్‌లో రికార్డు స్థాయిలో మొక్కజొన్నను 2400 మద్దతు ధరకు కొనుగోలు చేసి, 1800 కు ప్రభుత్వం విక్రయించిందని నష్టాన్ని ప్రభుత్వమే భరించి రైతులకు అండగా నిలిచినట్లు తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వంపై కొందరు తప్పుడు ప్రచారాలు చేపడుతున్నారు.రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని, ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా రైతులు ఇంటి నుంచే యూరియాను బుక్ చేసుకునే అవకాశం కల్పించడం కూడా అందులో భాగమేనన్నారు.రైతులు సంప్రదాయ పంటలతో పాటు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తూ ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు.

అనంతరం ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకున్న రైతులకు యూరియా బస్తాలను జిల్లా కలెక్టర్ అంకిత్, ఎమ్మెల్యే కోరం కనకయ్య చేతుల మీదుగా అందజేశారు.

టేకులపల్లి పర్యటనలో భాగంగా ఏ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని జిల్లా కలెక్టర్ అంకిత్, ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారురాలు ధారావత్ చుక్కి, భర్త టిక్లీ నిర్మిస్తున్న ఇంటిని సందర్శించి నిర్మాణ పనుల పురోగతి, నిధుల విడుదల తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులు త్వరగా గృహ ప్రవేశం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

 

ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ లక్కినేని సురేంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, సర్పంచ్ బోడ బాలు, కొత్తగూడెం ఆర్‌డీఓ మధు, సహకార శాఖ అధికారి శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!