మల్లంపేట్ జంక్షన్‌లో ట్రాఫిక్‌కు చెక్..!

► ట్రయల్ రన్‌తో ట్రాఫిక్ ప్రవాహంలో గణనీయమైన మార్పు
► 600 మీటర్ల మేర మీడియన్ ఏర్పాటు.. జంక్షన్ మూసివేత
► ఓ ఆర్ ఆర్ వైపు వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాల సూచన
► ప్రజల సహకారంతో ట్రాఫిక్ నియంత్రణ మరింత సమర్థవంతం
కుత్బుల్లాపూర్, జూన్ 20 ( నమస్తే భరత్ ): బాచుపల్లి ఫ్లైఓవర్ ప్రారంభం అనంతరం బాచుపల్లి నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్–4A వైపు వెళ్లే వాహనాల సంఖ్య భారీగా పెరగడంతో మల్లంపేట్ గ్రామ పరిసరాల్లో తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ నెలకొంది. ముఖ్యంగా మల్లంపేట్ జంక్షన్ వద్ద ఇరుకైన రహదారి కారణంగా తరచూ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాచుపల్లి నుంచి రత్నదీప్ సూపర్ మార్కెట్ వరకు సుమారు 1.5 కిలోమీటర్ల మేర 80 అడుగుల వెడల్పు గల మీడియన్ రహదారి ఉండగా, ఆ తరువాత పోచమ్మ ఆలయం వరకు ఉన్న సుమారు 600 మీటర్ల రహదారి కేవలం 25 నుంచి 30 అడుగుల వెడల్పుతో మీడియన్ లేకుండా ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. మల్లంపేట్ జంక్షన్ వద్ద ఒక వైపు ట్రాఫిక్‌ను నిలిపివేసి, మరో రెండు వైపుల వాహనాలను పంపించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు తాత్కాలిక ట్రయల్ రన్ చేపట్టారు. ఇందులో భాగంగా గత 15 రోజులుగా మల్లంపేట్ జంక్షన్‌ను సిమెంట్ బ్లాకులతో మూసివేసి, రత్నదీప్ సూపర్ మార్కెట్ నుంచి పోచమ్మ ఆలయం వరకు సుమారు 600 మీటర్ల మేర 400 సిమెంట్ బ్లాకులతో మీడియన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా రత్నదీప్ సూపర్ మార్కెట్, పోచమ్మ ఆలయం సమీపాల్లో యూ-టర్న్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ట్రయల్ రన్ అమల్లోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ ప్రవాహం గణనీయంగా మెరుగుపడినట్లు అధికారులు తెలిపారు. వాహనాల వేచి ఉండే సమయం తగ్గడంతో పాటు ట్రాఫిక్ జామ్‌లు తగ్గి, ORR వైపు వెళ్లే వాహనాలు వేగంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ మార్పులకు స్థానిక ప్రజలు, వాహనదారుల నుంచి సానుకూల స్పందన లభిస్తున్నట్లు వెల్లడించారు. రాత్రి వేళల్లో వాహనదారుల భద్రత దృష్ట్యా సిమెంట్ బ్లాకులపై రేడియం స్టిక్కర్లను కూడా ఏర్పాటు చేశారు.
వాహనదారులకు సూచనలు
బాచుపల్లి నుంచి బౌరంపేట్, షాంబీపూర్, మేడ్చల్, షామీర్‌పేట్, ఘట్‌కేసర్, వరంగల్, విజయవాడ వైపు వెళ్లే వాహనదారులు మల్లంపేట్ విలేజ్ జంక్షన్ వద్ద ఎడమవైపు తిరిగి బీసీ కాలనీ 50 అడుగుల రహదారి మీదుగా ORR అండర్‌పాస్ (కిలోమీటర్–36) ద్వారా బౌరంపేట్, షాంబీపూర్ మార్గాలను వినియోగించి మల్లంపేట్ 4A ఎంట్రీ ర్యాంప్ ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. అదేవిధంగా బాచుపల్లి నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనదారులు మల్లంపేట్ విలేజ్ జంక్షన్ మీదుగా ORR సర్వీస్ రోడ్‌ను ఉపయోగించి ఎంట్రీ–4A ర్యాంప్ ద్వారా ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యలకు ప్రజలు సహకరించి సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నర్సింగ్ రావు విజ్ఞప్తి చేశారు.



