ప్యాలియేటివ్ కేర్ సిబ్బందికి పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలి –
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్‌కు వినతి పత్రం
నమస్తే భారత్ :-మహబూబాబాద్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్యాలియేటివ్ కేర్‌లో విధులు నిర్వహిస్తున్న సుమారు 60 మంది ఆయాలకు గత 10 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తమ పిల్లల విద్యా ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొన్నదని ప్యాలియేటివ్ కేర్ ఆయాలు భూక్యా రాజేశ్వరి, ధరావత్ లక్ష్మీ, సంధ్య జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ ని కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా తెలంగాణ నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సంఘాల ఐకాస రాష్ట్ర నాయకులు డాక్టర్ కుమార్ నాయక్ & బాలాజీ చౌహాన్ , మాట్లాడుతూ ప్రభుత్వం జీవో నెం.1187, 1190, 1195లను వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ జీవోలు అమలైతే రాష్ట్రంలోని సుమారు 4,500 మంది ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు నాలుగున్నర సంవత్సరాల 30% పీఆర్‌సీ బకాయిలు అందడంతో పాటు, ఇప్పటివరకు 30% పీఆర్‌సీ ప్రయోజనం పొందని ఉద్యోగులందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ అంశంపై ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, కోర్టు జీవోలను అమలు చేయాలని ఆదేశించినప్పటికీ ప్రభుత్వం.స్పందించకపోవడంతో ధిక్కార పిటిషన్లు కూడా దాఖలయ్యాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కోర్టు ఆదేశాలను గౌరవించి జీవోలను అమలు చేయాలని కోరారు.అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఫిజియోథెరపిస్టుల యూనియన్ అధ్యక్షుడు డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక ఫిజియోథెరపీ విభాగాలను ఏర్పాటు చేసి, ఖాళీగా ఉన్న ఫిజియోథెరపిస్టుల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.అలాగే జాతీయ అలైడ్ మరియు హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ చట్టం–2021 (NCAHP Act–2021) ప్రకారం ప్రతి రాష్ట్రంలో స్టేట్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం తప్పనిసరి అయినప్పటికీ, తెలంగాణలో ఇప్పటివరకు కౌన్సిల్‌ను ఏర్పాటు చేయకపోవడంతో పాటు ఛైర్మన్‌ను కూడా నియమించలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కౌన్సిల్‌ను ఏర్పాటు చేసి, అలైడ్ హెల్త్‌కేర్ వృత్తి నిపుణుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ సానుకూలంగా పరిశీలించి ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ ఆవశ్యకత చాలా అవసరమని.సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి ఉద్యోగులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.



