ePaper
Monday, July 27, 2026
ePaper
Homeఎడిటోరియల్Not reassurance for farmers... but betrayal of farmers.

Not reassurance for farmers… but betrayal of farmers.

📰 Generate e-Paper Clip

రైతులకు భరోసా కాదు… రైతు వంచన

కాంగ్రెస్ హామీలన్నీ బూటకమేనన్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

పేరు మార్పులతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ప్రభుత్వం

రైతు రుణమాఫీ, రైతు భరోసా అమలులో కాంగ్రెస్ విఫలం

యూరియా, ధాన్యం కొనుగోళ్లలో రైతాంగం తీవ్ర ఇబ్బందులు

రైతు బీమా అందరికీ అమలు చేయకపోతే పోరాటం తప్పదు: బీఆర్ఎస్

కుత్బుల్లాపూర్, జూన్ 20 ( నమస్తే భరత్ ): రాష్ట్రంలో రైతులకు భరోసా కల్పిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రైతాంగాన్ని వంచించడమే కాకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ విమర్శించారు. చింతల్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ పాలన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పథకాల పేర్లు మార్చి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందడంతో పాటు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. ప్రస్తుతం రైతులకు అవసరమైన యూరియా సకాలంలో అందడం లేదని, ధాన్యం కొనుగోళ్లలో కూడా ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వెనుకబడిందన్నారు. రైతుబంధు పథకాన్ని రైతు భరోసాగా పేరు మార్చడం తప్ప రైతులకు కొత్తగా ఎలాంటి ప్రయోజనం కల్పించలేదని ఆరోపించారు. రెండు లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి, తూతూమంత్రంగా అమలు చేసి చేతులు దులుపుకుందని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో దాదాపు 600 మంది రైతులు ఉండగా కేవలం 13 మందికే రుణమాఫీ వర్తించిందని తెలిపారు. రైతు రుణమాఫీ అమలుపై అసెంబ్లీలో ప్రశ్నించినప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయిందని విమర్శించారు. ముఖ్యమంత్రి సొంత గ్రామంలోనే పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు కాలేదని ఆరోపించారు. రైతు అకాల మరణం చెందితే వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బీమా అమలులో నిర్లక్ష్యం ప్రదర్శించిందని, అర్హులైన అనేక మంది రైతు కుటుంబాలు ప్రయోజనాలకు దూరమయ్యాయని ఆరోపించారు. తెలంగాణను దేశంలోనే అధిక ధాన్యం ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్న ఆయన, ప్రస్తుతం రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడంలో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందుతోందన్నారు. వ్యవసాయాన్ని పండుగగా మార్చిన పాలనకు భిన్నంగా, నేడు రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బీమా పథకాన్ని ప్రతి అర్హ రైతు కుటుంబానికి అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన కేపీ వివేకానంద్, లేనిపక్షంలో రైతుల తరఫున బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!