యువ హామీల అమలుపై కాంగ్రెస్‌ను నిలదీయాలి

-18న సరూర్‌నగర్‌లో ‘యువ సంగ్రామ సదస్సు’ విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పిలుపు
-పేట్‌బషీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సన్నాహక సమావేశం
-అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్.. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
-యువతకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శ
-రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి హామీలు అమలు కాలేదని ఆరోపణ
-రైతులు, మహిళలు, ఉద్యోగులు, బలహీన వర్గాలందరికీ అన్యాయం జరిగిందన్న బీఆర్ఎస్ నేతలు
-ప్రశ్నించే వారిపై కేసుల బెదిరింపులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వ్యాఖ్య
-యూత్ డిక్లరేషన్‌ను అమలు చేయాలని యువతతో కలిసి ఉద్యమిస్తామని స్పష్టం
-రాష్ట్ర నలుమూలల నుంచి యువత భారీగా హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపు
పేట్‌బషీరాబాద్, జూలై 14 ( నమస్తే భరత్); రాష్ట్రంలో యువతకు ఇచ్చిన ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, అమలు కాని హామీలపై తెలంగాణ యువత సమరశంఖం పూరించాలని బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు శంభీపూర్ రాజు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించనున్న “యువ సంగ్రామ సదస్సు” విజయవంతానికి చేపట్టాల్సిన కార్యాచరణపై పేట్‌బషీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధ్యక్షత వహించగా, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు కార్యక్రమ నిర్వహణ, ప్రజల సమీకరణ, యువత భాగస్వామ్యం తదితర అంశాలపై పలు సూచనలు, దిశానిర్దేశాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ హామీని అమలు చేయలేదని, దీంతో నిరుద్యోగ యువత ఆశలు అడియాశలయ్యాయని విమర్శించారు. ప్రాజెక్టుల్లో తగినంత నీరు అందుబాటులో ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు విడుదల చేయకుండా పంటలు ఎండిపోయే పరిస్థితులు తీసుకొచ్చారని ఆరోపించారు. ఉద్యోగులు, రైతులు, మహిళలు, బడుగు బలహీన వర్గాలు, యువతతో పాటు అన్ని వర్గాలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, యువత తదితర వర్గాల కోసం ప్రకటించిన 13 డిక్లరేషన్లలోని హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి ప్రజలు, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ఒత్తిళ్లు, కేసుల బెదిరింపులతో భయపెట్టే ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. ప్రజలు ఇచ్చిన పాలనా కాలంలో ఇప్పటికే సగానికి పైగా పూర్తయినా, ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం ఆశించిన పురోగతి చూపలేకపోయిందని అన్నారు. సంక్షేమ పథకాలను సైతం సమర్థంగా కొనసాగించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. 2023 జూలై 18న ప్రకటించిన యూత్ డిక్లరేషన్‌లో రెండు లక్షల ఉద్యోగాలు, నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి, యువతకు ప్రత్యేక ఆర్థిక సహాయ పథకాలు వంటి అనేక హామీలు ఇచ్చినా, దాదాపు మూడేళ్లు గడుస్తున్నా అమలు కాలేదని విమర్శించారు. ఈ హామీల అమలు కోసం “యువ సంగ్రామ సదస్సు” వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని, యువత హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ నెల 18వ తేదీన సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించే యువ సంగ్రామ సదస్సుకు రాష్ట్ర నలుమూలల నుంచి యువత, పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



