పేదల ప్రాణరక్షకంగా ఆరోగ్యశ్రీ.. సాధన వెనుక ఎమ్మార్పీఎస్ ఉద్యమమే: నేతలు
-కుత్బుల్లాపూర్‌లో ఘనంగా ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవం నిర్వహణ
-పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఉద్యమ ఫలితమే ఆరోగ్యశ్రీ పథకం అని కొనియాడిన వక్తలు
-విద్య, వైద్యం ఉచితంగా అందించడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత అని అభిప్రాయం
-అణగారిన వర్గాల ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకం సంజీవనిగా మారిందని వ్యాఖ్య
-పారిశుద్ధ్య కార్మికులు, మహిళలతో భారీగా పాల్గొన్న ప్రజలు
కుత్బుల్లాపూర్, ఆగస్టు 7 ( నమస్తే భరత్ ): అణగారిన, పేద ప్రజలకు వరంగా మారిన ఆరోగ్యశ్రీ పథకం సాధన దినోత్సవాన్ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి రాసమల్ల యాదగిరి మాదిగ అధ్యక్షతన కుత్బుల్లాపూర్ జోనల్ కార్యాలయ పరిధిలోని కుత్బుల్లాపూర్ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాసమల్ల యాదగిరి మాదిగ మాట్లాడుతూ, 2004 ఆగస్టు 7న గుండె జబ్బులతో బాధపడుతున్న పేద చిన్నారులకు ప్రభుత్వం ఉచితంగా శస్త్రచికిత్సలు చేయాలని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో చేపట్టిన ఉద్యమ ఫలితంగానే ఆరోగ్యశ్రీ పథకం రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ప్రభుత్వాలు ప్రజలకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందించడం తమ ప్రాథమిక బాధ్యతగా భావించాలని ఆయన సూచించారు. ఈ రెండు రంగాల్లో బలోపేతమైన సేవలు అందితే పేద ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిలువేరు శ్రీనివాస్ మాదిగ, సీనియర్ నాయకులు, మాదిగ మహిళా సమాఖ్య మాజీ జిల్లా అధ్యక్షురాలు నడిమి దొడ్డి సలోమి, యువసేన మాజీ ప్రధాన కార్యదర్శి ఇష్టం రమేష్ మాదిగ, వేల్పుగొండ రాజేష్ పాల్గొన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో పారిశుద్ధ్య కార్మికులు, మహిళలు, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరై ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవాన్ని విజయవంతం చేశారు.



