ఆరోగ్యవంతమైన కుటుంబమే అభివృద్ధి చెందిన సమాజానికి బాట

-ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా డీఎంహెచ్‌వో డా. కె. ఆనంద్ పిలుపు
-జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో ఘనంగా ప్రపంచ జనాభా దినోత్సవం
-గర్భధారణల మధ్య సరైన వ్యవధితో తల్లి–శిశు ఆరోగ్యానికి భరోసా
-కుటుంబ నియంత్రణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచన
-జిల్లా వ్యాప్తంగా వారంరోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు
-ఉత్తమ సేవలందించిన ఆరోగ్య సిబ్బందికి సత్కారం.. దంపతులకు నగదు ప్రోత్సాహకం
-ఆరోగ్యవంతమైన కుటుంబాల నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
కుత్బుల్లాపూర్, జూలై 11 ( నమస్తే భరత్ ): పెరుగుతున్న జనాభాను సమర్థవంతంగా నియంత్రిస్తూ ఆరోగ్యవంతమైన కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారానే సమాజం సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. కె. ఆనంద్ అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం–2026 సందర్భంగా శనివారం అంతాయిపల్లిలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఉన్న జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆరోగ్యకరమైన తల్లి–శిశు సంక్షేమానికి గర్భధారణల మధ్య సరైన వ్యవధి అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. కుటుంబ నియంత్రణను బాధ్యతగా స్వీకరించడం ద్వారా కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, ఆర్థిక స్థిరత్వం, పిల్లలకు మెరుగైన విద్య, సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని వివరించారు. ఈ ఏడాది ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జూలై 11 నుంచి జూలై 18 వరకు “ఆరోగ్యకరమైన మాతా–శిశు సంక్షేమం కోసం గర్భధారణల మధ్య సరైన వ్యవధి – అనాలోచిత గర్భధారణల నివారణ” అనే నినాదంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పిల్లల మధ్య సరైన అంతరం పాటించడం ద్వారా తల్లి, శిశువు ఆరోగ్యం మరింత మెరుగుపడుతుందని ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జనాభా పెరుగుదలతో ఆహారం, తాగునీరు, ఆరోగ్య సేవలు, విద్య, ఉపాధి వంటి మౌలిక వనరులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోందని పేర్కొన్న డీఎంహెచ్‌వో, కుటుంబ నియంత్రణ పద్ధతులు, గర్భనిరోధక సాధనాల వినియోగం, మాతా–శిశు సంక్షేమ సేవలపై ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా కుటుంబ సంక్షేమ అవగాహన కార్యక్రమాలు, ఆరోగ్య ర్యాలీలు, ఆరోగ్య విద్యా సదస్సులు, కుటుంబ నియంత్రణ సేవల ప్రోత్సాహ కార్యక్రమాలు, అర్హులైన దంపతుల సన్మాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యశాఖలో విశిష్ట సేవలందించిన పలువురు ఉద్యోగులకు మెరిట్ సర్టిఫికెట్లు, మెమెంటోలు అందజేసి సత్కరించారు. అలాగే ఒక్క ఆడపిల్లతో కుటుంబ నియంత్రణను స్వీకరించిన దంపతులకు ప్రభుత్వం అందిస్తున్న రూ.1,000 నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి, కీసర డివిజన్ ఉప జిల్లా వైద్యాధికారులు డా. లావణ్య, డా. గీత, జిల్లా ప్రోగ్రామ్ అధికారులు డా. శ్రీదేవి, డా. నాగరాజు, డా. పవన్ రెడ్డి, డా. కౌశిక్, డెమో వసంత రెడ్డి, ఉషారాణి, విజయ్ కుమార్, జిల్లాలోని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. “చిన్న కుటుంబం.. ఆరోగ్యకర జీవనం.. సమాజ అభివృద్ధికి బలమైన పునాది” అనే సందేశంతో జిల్లా వైద్యశాఖ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు ప్రజల్లో కుటుంబ సంక్షేమంపై మరింత చైతన్యాన్ని తీసుకురానున్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.



