ePaper
Saturday, July 11, 2026
ePaper
Homeఎడిటోరియల్ఎస్‌ఐఆర్' ప్రక్రియ వేగవంతం చేయాలి

ఎస్‌ఐఆర్’ ప్రక్రియ వేగవంతం చేయాలి

📰 Generate e-Paper Clip

ఎస్‌ఐఆర్’ ప్రక్రియ వేగవంతం చేయాలి


పారదర్శకంగా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహణకు సీఈవో సుదర్శన్ రెడ్డి ఆదేశం

కూకట్పల్లిలో క్షేత్రస్థాయిలో పరిశీలన

బీఎల్‌వోలు ఇంటింటికీ చేరి ఫారాల పంపిణీ, స్వీకరణ చేపట్టాలి

అందిన దరఖాస్తులను వెంటనే డిజిటలైజ్ చేయాలని సూచన

అందుబాటులో లేని ఓటర్లను ఫోన్ ద్వారా సంప్రదించాలని ఆదేశం

హెల్ప్‌డెస్క్‌ల పనితీరుపై సమీక్ష.. ఓటర్లతో నేరుగా ముచ్చటించిన సీఈవో

కుత్బుల్లాపూర్, జూలై 11 ( నమస్తే భారత్ ); ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, డిజిటలైజేషన్‌ను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. శనివారం కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలాజీ నగర్ వార్డు కార్యాలయంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి సీఈవో పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఫారాలను పంపిణీ చేస్తున్నారా, ఓటర్లు నింపిన ఫారాలను తిరిగి స్వీకరిస్తున్నారా అనే అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్ పనితీరును పరిశీలించిన ఆయన, ఫారాల పరిశీలన, నమోదు, డిజిటలైజేషన్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం ఉండరాదని అధికారులను ఆదేశించారు. ఓటర్ల నుంచి అందిన ఫారాలను అదే రోజు డిజిటలైజ్ చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. అనంతరం సమీప అపార్ట్‌మెంట్లలో కొనసాగుతున్న ఫారాల పంపిణీ, అప్‌లోడింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఓటర్లకు ఫారాల పూరణపై పూర్తి అవగాహన కల్పించి అవసరమైన సహాయం అందించాలని బీఎల్‌వోలకు సూచించారు. ఇంట్లో లేని ఓటర్లను ఫోన్ ద్వారా సంప్రదించి వివరాలు సేకరించి ఫారాలు అందజేయాలని, అందుబాటులో లేని వారి వివరాలను వెంటనే సూపర్వైజర్ల దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించారు.
2002 తర్వాత ఓటరు జాబితాలో నమోదు కాని వారి దరఖాస్తుల పూరణ విధానంపై అధికారులకు సీఈవో స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. అనంతరం కేపీహెచ్‌బీ 6వ ఫేజ్‌లోని అపార్ట్‌మెంట్‌లను సందర్శించి ఓటర్లతో నేరుగా మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఇండో ఫార్చ్యూన్ గ్రేటర్ కమ్యూనిటీలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ను కూడా పరిశీలించి అక్కడి ఓటర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ఈ పర్యటనలో కూకట్పల్లి జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్, ఎమ్మార్వో అశోక్, డిప్యూటీ కలెక్టర్ ఆంజనేయులు, సూపర్వైజర్లు, బీఎల్‌వోలు తదితర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!